కొడితే రికార్డులే ... | From today the final Test in Chennai | Sakshi
Sakshi News home page

కొడితే రికార్డులే ...

Published Thu, Dec 15 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

కొడితే రికార్డులే ...

కొడితే రికార్డులే ...

భారీ విజయమే భారత్‌ లక్ష్యం
4–0పై కోహ్లి సేన దృష్టి ∙పరువు కాపాడుకునే ప్రయత్నంలో ఇంగ్లండ్‌
నేటి నుంచి చెన్నైలో చివరి టెస్టు ∙ఉ.గం.9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌–1లో లైవ్‌


విరాట్‌ కోహ్లి మరో 135 పరుగులు చేస్తే ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడవుతాడు. అశ్విన్‌ మరో 9 వికెట్లు పడగొడితే ఒక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలుస్తాడు. ఇవి మన స్టార్‌ ఆటగాళ్లు చేరుకోగలిగే మైలురాళ్లు. భారత్‌ గెలిస్తే తొలిసారి ఇంగ్లండ్‌ను 4–0తో చిత్తు చేసినట్లవుతుంది. 2011 నాటి సిరీస్‌ ఓటమికి లెక్క సరిపోతుంది. భారత టెస్టు చరిత్రలో రెండోసారి ప్రత్యర్థిని 4–0తో ఓడించిన జట్టుగా కోహ్లి సేన నిలుస్తుంది. మ్యాచ్‌ గెలిచినా, ‘డ్రా’ అయినా మన జట్టు వరుసగా 18వ మ్యాచ్‌ను ఓటమి లేకుండా ముగించిన కొత్త రికార్డు నమోదవుతుంది.

టెస్టు సిరీస్‌లో భారత్‌ చెలగాటం ఇంగ్లండ్‌కు ప్రాణసంకటంలా మారింది. వరుస విజయాల జోరుతో మరో మ్యాచ్‌ నెగ్గాలని, రికార్డులు బద్దలు కొట్టాలని టీమిండియా పట్టుదలగా ఉండగా... సిరీస్‌ కోల్పోయాక కనీసం పరువు దక్కించుకునేందుకు ఇంగ్లండ్‌ పోరాడుతోంది. ఇప్పటికే సమష్టి వైఫల్యంతో దెబ్బతిన్న ఇంగ్లండ్‌... ‘వర్దా’ తర్వాత సొంతగడ్డపై అశ్విన్‌ రూపంలో రానున్న పెను తుపానును ఎదుర్కోగలదా!  

చెన్నై: ‘వర్దా’ తుపాను తర్వాత నెలకొన్న ప్రశాంతత మధ్య భారత్, ఇంగ్లండ్‌ సిరీస్‌లో ఐదో టెస్టుకు చెపాక్‌లో రంగం సిద్ధమైంది. ఎన్నో ప్రతికూలతల మధ్య మ్యాచ్‌ నిర్వహణ కోసం చిదంబరం స్టేడియం సిబ్బంది తీవ్రంగా శ్రమించడంతో అనుకున్న ప్రకారం నేటి (శుక్రవారం) నుంచి చివరి టెస్టు జరగనుంది. ఇప్పటికే 3–0తో సిరీస్‌ నెగ్గి తిరుగులేని ఆధిక్యం కనబరిచిన భారత్‌ దీనిని మరింత పెంచుకోవాలని భావిస్తోంది. భారత్‌లో అడుగు పెట్టిన నాటినుంచి విజయానికి ఆమడ దూరంలో నిలిచిన ఇంగ్లండ్‌ ఒత్తిడి లేకుండా ఆడి కాస్త మెరుగ్గా సిరీస్‌ ముగించాలని ఆశిస్తోంది. ప్రస్తుత ఫామ్‌ ప్రకారం ఈ టెస్టును ఆ జట్టు ‘డ్రా’గా ముగించగలిగినా వారికి గెలుపుతో సమానమే!

మార్పుల్లేకుండానే...
విరాట్‌ కోహ్లి టెస్టు కెప్టెన్‌ అయ్యాక గాయం కారణంగా గానీ, వ్యూహాల వల్ల గానీ ప్రతీ టెస్టు మ్యాచ్‌కు తుది జట్టులో కనీసం ఒక మార్పు అయినా జరిగింది. అయితే పెళ్లి తర్వాత జట్టుతో చేరిన ఇషాంత్‌ శర్మకు కనీసం ఒక మ్యాచ్‌లోనైనా అవకాశం ఇవ్వాలని భావిస్తే తప్ప... తొలిసారి కోహ్లి నేతృత్వంలో ఎలాంటి మార్పు లేకుండా జట్టు బరిలోకి దిగవచ్చు. తొమ్మిదో స్థానంలో వచ్చే ఆటగాడు కూడా సెంచరీ చేయగల స్థాయిలో ఉన్న భారత జట్టుకు ఎలాంటి బ్యాటింగ్‌ సమస్యలు లేవు. కోహ్లి తిరుగులేని ఆటకు విజయ్, పుజారా సహకారం ఉంటోంది. లోకేశ్‌ రాహుల్‌ నుంచి మాత్రం ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ రాలేదు. గత మ్యాచ్‌లో విఫలమైన అతని కర్ణాటక సహచరుడు కరుణ్‌ నాయర్‌ మెరుగ్గా ఆడితేనే మున్ముందు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. బౌలింగ్‌లో మన స్పిన్నర్లు అశ్విన్, జడేజా, జయంత్‌ ఎదురు లేకుండా సాగుతున్నారు. ఇక్కడా కొత్త రికార్డులు కొల్లగొట్టడానికి వీరు సిద్ధమయ్యారు. ఆరంభంలో పిచ్‌ సీమర్లకు అనుకూలిస్తే ఉమేశ్, భువనేశ్వర్‌ మంచి ప్రభావం చూపించగలరు. మొత్తంగా వరుస విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసం టీమ్‌లో తొణికిసలాడుతోంది. ఈ జట్టును ఆపడం ప్రత్యర్థికి అంత సులువు కాదు.

కోలుకుంటారా...
నిజానికి ఇంగ్లండ్‌ భారత గడ్డపై అడుగు పెట్టినప్పుడు ఆ జట్టు ఇంత పేలవంగా ఆడుతుందని ఎవరూ ఊహించలేదు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో పోలిస్తే టెస్టు స్పెషలిస్ట్‌ టీమ్‌ కావడం, భారత్‌లో కూడా గతంలో మెరుగైన రికార్డు ఉండటం వల్ల గట్టి పోటీ తప్పదనిపించింది. కానీ కోహ్లి సేన దూకుడు ముందు కుక్‌ బృందం తేలిపోయింది. ఇప్పుడు సిరీస్‌ ముగింపునకు వచ్చిన సమయంలోనైనా ఆ టీమ్‌ కాస్త గట్టిగా నిలబడితే మెరుగైన ఫలితం రాబట్టవచ్చు. రూట్‌ మినహా ఎవరూ బ్యాటింగ్‌లో రాణించలేకపోయారు. కుక్‌ ఆట కూడా ఆశించిన స్థాయిలో లేకపోగా, స్టోక్స్‌ గత రెండు టెస్టుల్లోనూ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బెయిర్‌స్టో ఆట జట్టుకు పెద్దగా ఉపయోగపడలేదు. మొయిన్‌ అలీ కూడా విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది. కనీసం ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ పట్టుదలగా ఆడాల్సి ఉంది. గత రెండు మ్యాచ్‌లలో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయిన అండర్సన్‌ గాయంతో ఈ టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో మూడో స్పిన్నర్‌గా లియామ్‌ డాసన్‌ వస్తాడు. మ్యాచ్‌ రోజు ఉదయం ఫిట్‌నెస్‌ టెస్టులో నెగ్గితే వోక్స్‌ స్థానంలో బ్రాడ్‌ జట్టులోకి రానున్నాడు. సిరీస్‌లో 22 వికెట్లు తీసిన రషీద్‌కు మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు మరో అవకాశం వచ్చింది.

తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రాహుల్, విజయ్, పుజారా, నాయర్, పార్థివ్, అశ్విన్, జడేజా, జయంత్, ఉమేశ్, భువనేశ్వర్‌/ఇషాంత్‌. ఇంగ్లండ్‌: కుక్‌ (కెప్టెన్‌), జెన్నింగ్స్, రూట్, అలీ, బెయిర్‌స్టో, స్టోక్స్, బట్లర్, డాసన్, రషీద్, బాల్, బ్రాడ్‌/ వోక్స్‌.

⇒ 13  ఈ మైదానంలో ఆడిన 31 టెస్టులలో భారత్‌ 13 గెలిచింది

⇒ 3  ఇక్కడ 8 టెస్టులు ఆడిన ఇంగ్లండ్‌ 3 గెలిచి, 4  ఓడింది.

మా జట్టేమీ అజేయమైనది కాదు. ఈ విజయాలు ఒక దశ మాత్రమే. రాబోయే 7–8 ఏళ్ల పాటు అత్యుత్తమ జట్టుగా ఆధిపత్యం ప్రదర్శించడంలో భాగంగా సాగుతున్న ప్రక్రియ ఇది. ప్రపంచంలో ఇంకా చాలా చోట్ల ఆడాల్సి ఉందని నాకు తెలుసు.  సిరీస్‌ సాధించినా దూకుడు తగ్గించం. 4–0తో గెలవాలని మేం పట్టుదలగా ఉన్నాం. నాకు అవకాశం లభిస్తే 2018లో జరిగే ఇంగ్లండ్‌ సిరీస్‌కు ముందు కనీసం నెల రోజులు కౌంటీల్లో ఆడి అక్కడి పిచ్‌లు, వాతావరణానికి అలవాటు పడాలని భావిస్తున్నా.    –విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌

మా ప్రయత్నంలో లోపం లేదు. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. ఓడినప్పుడు సహజంగానే విమర్శలు వస్తాయి. వేగంగా సాగిపోయే క్రికెట్‌లో ప్రతీకారం అనే మాటను నేను నమ్మను. 2014 సిరీస్‌ జరిగి కూడా చాలా రోజులైనట్లు అనిపిస్తోంది. నా ఇన్నేళ్ల కెరీర్‌లో ఎప్పుడూ మ్యాచ్‌కు ముందు నెట్‌ ప్రాక్టీస్‌ జరగని రోజు లేదు. అయితే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన చోట మా ప్రాక్టీస్‌ ముఖ్యం కాదు. మహా అయితే మేం హోటల్‌æనుంచి స్టేడియంకు వస్తున్నాము. చుట్టూ పరిస్థితి చూస్తే మేం ఎంత అదృష్టవంతులమో అనిపిస్తుంది.     – కుక్, ఇంగ్లండ్‌ కెప్టెన్‌  

జో రూట్‌ సపరేటు... 
తుపాను కారణంగా మైదానం చిత్తడిగా ఉండటంతో గురువారం కూడా ఇరు జట్ల ఆటగాళ్లు నెట్‌ ప్రాక్టీస్‌లో పాల్గొనలేకపోయారు. అయితే ఇంగ్లండ్‌ ప్రధాన బ్యాట్స్‌మన్‌ జో రూట్‌ మాత్రం తన సన్నాహాలకు బ్రేక్‌ వేయలేదు. అందుకోసం అతను మరో ‘దారి’ని వెతుక్కున్నాడు. చెన్నై గల్లీల్లోకి దూరి తన సాధన కొనసాగించాడు. స్టేడియం సమీపంలో ఉన్న సిమెంట్‌ రోడ్డుపైన అతను సహాయక సిబ్బందితో కలిసి సుదీర్ఘ సమయం పాటు సీరియస్‌గా సాధన చేయడం విశేషం.

పిచ్, వాతావరణం
చెన్నై నగరంలో వర్షం తగ్గుముఖం పట్టి గురువారం బాగా ఎండకాసింది. అయితే బొగ్గులతో ఆరబెట్టిన తర్వాత కూడా పిచ్‌పై కాస్త తేమ ఉంది. దాంతో ఆరంభంలో సీమ్‌కు సహకరించవచ్చు. కానీ మ్యాచ్‌ సాగినకొద్దీ ఇది స్పిన్‌కు అనుకూలంగా మారిపోతుంది. టెస్టు జరిగే రోజులు భారీ వర్ష సూచన లేకున్నా ఆకాశం మేఘావృతమై ఉండటంతో చినుకులు పడే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement