
గగన్ ఖోడా(ఫైల్ ఫోటో)
జైపూర్: గగన్ ఖోడా.. రాజస్థాన్ కు చెందిన ఈ మాజీ క్రికెటర్ 1998, మే నెలలో భారత జాతీయ క్రికెట్ జట్టు తరపున కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడాడు. అందులో అతని అత్యధిక స్కోరు 89 పరుగులు. కాగా, ఆ తరువాత అతనికి జట్టులో స్థానం దక్కలేదు. అప్పట్లో గగన్ కు జాతీయ జట్టులో స్థానం దక్కపోవడానికి కారణాలు అప్రస్తుతమే అయినా.. తాజాగా భారత క్రికెట్ సెలెక్టర్ గా ఎంపికై వార్తలో నిలిచాడు.
సెంట్రల్ జోన్ నుంచి రాజేందర్ సింగం హన్స్ స్థానంలో గగన్ ఖోడాకు సెలెక్షన్ కమిటీలో అవకాశం కల్పించారు. అయితే దీనిపై గగన్ ఖోడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'నాకు బీసీసీఐ సెలెక్టర్ గా ఎంపికైనట్లు పిలుపు వచ్చింది. నేను నిజంగా ఆశ్చర్యానికి గురయ్యా. చాలా కాలం నుంచి క్రికెట్ దూరంగా ఉంటున్ననాకు బీసీసీఐ నుంచి కాల్ రావడాన్ని నమ్మలేకపోయా. నేను ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కంపెనీలో పని చేస్తున్నా. నాకు బీసీసీఐ అప్పజెప్పిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తా' అని ఖోడా ఆనందం వ్యక్తం చేశాడు.
గగన్ ఖోడా 132 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో ఆడి 8,516 పరుగులు చేశాడు. దాదాపు 40.00 సగటుతో 20 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలు చేశాడు. అందులో అతని బెస్ట్ 300 పరుగులు. కాగా, భారత క్రికెట్ జట్టులో ఆడటానికి అతనికి ఎక్కువ అవకాశాలు రాలేదు. కాగా, జాతీయ క్రికెట్ ను వదిలేసిన 17 ఏళ్లకు గగన్ కు ఈ రూపంలో అదృష్టం తలుపు తట్టడం నిజంగా గొప్ప విషయమే కదా..