ముంబై: ప్రస్తుత భారత క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆడిన టెస్టు మ్యాచ్‌ల సంఖ్య ఆరు! సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనుభవం విషయంలో ప్రసాద్ ఎన్నో సార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కొత్త సెలక్టర్ ఎంపికకు అర్హత విషయంలో బీసీసీఐ భారీ మార్పులేమీ చేయలేదు. కెరీర్‌లో 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన వారు సీనియర్ జట్టు సెలక్టర్ పదవికి అర్హులని ప్రకటించింది. ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీలో ఏర్పడబోయే రెండు ఖాళీల కోసం బోర్డు దరఖాస్తులు కోరుతోంది. పదవీకాలం ముగిసిపోవడంతో ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు గగన్ ఖోడా తప్పుకోనున్నారు. వీరి స్థానాల్లో కొత్త సెలక్టర్లు వస్తారు. మిగిలిన ముగ్గురు సెలక్టర్లు శరణ్‌దీప్ సింగ్, దేవాంగ్ గాందీ, జతిన్ పరాంజపేలు మరో ఏడాది పాటు కొనసాగనున్నారు.
బోర్డు పేర్కొన్న అర్హతలను బట్టి చూస్తే... సెలక్టర్ పదవి కోసం దరఖాస్తు చేసుకునేవారు కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలతో పాటు 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండటంతో పాటు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కనీసం ఐదేళ్లు పూర్తయి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 60 ఏళ్లు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 24ను చివరి తేదీగా నిర్ణయించగా... సెలక్టర్లను ఎవరు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారనే విషయంలో మాత్రం బోర్డు స్పష్టతనివ్వలేదు. సీనియర్ పురుషుల జట్టుతో పాటు జూనియర్ పురుషుల జట్టు, సీనియర్ మహిళల జట్ల సెలక్టర్ల కోసం కూడా బీసీసీఐ దరఖాస్తులు కోరింది.
టెస్టు జట్టులోకి రాహుల్?
ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఆఖరిసారిగా నేడు భారత సీనియర్ జట్టు ఎంపిక జరగనుంది. న్యూజిలాండ్‌లో జరిగే టెస్టు, వన్డే సిరీస్ కోసం టీమ్‌లను కమిటీ ఆదివారం ఎంపిక చేస్తుంది. వన్డే, టి20ల్లో అద్భుత ఫామ్‌లో ఉన్న లోకేశ్ రాహుల్‌ను టెస్టు టీమ్‌లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాహుల్ తన ఆఖరి టెస్టును వెస్టిండీస్‌తో కింగ్‌స్టన్‌లో గత ఆగస్టులో ఆడాడు. ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌లలో అతని పేరును పరిశీలించకుండా సెలక్టర్లు శుబ్‌మన్ గిల్‌ను రిజర్వ్ ఓపెనర్‌గా ఉంచారు. అయితే తాజా ప్రదర్శనతో రాహుల్ అవకాశాలు మెరుగయ్యాయి.
అశ్విన్, జడేజా రూపంలో ఇద్దరు స్పిన్నర్లు అందుబాటులో ఉండటంతో కుల్దీప్‌ను కాకుండా ఐదో పేసర్‌గా నవదీప్ సైనీ వైపే మొగ్గు కనిపిస్తోంది. చివరి నిమిషంలో ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమైన టి20లకు దూరమైన హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఫిట్‌గా మారితే వన్డేల్లోకి ఎంపిక చేయడం దాదాపుగా ఖాయం. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్‌పై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అతనికంటే మెరుగైన టెక్నిక్ కలిగిన రహానే కివీస్ గడ్డపై రాణించవచ్చనేది అంచనా. అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాలని భావిస్తే ముంబై ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ పేరు అందరికంటే ముందుగా పరిశీలనలో ఉంది. ఈ టూర్‌లో భారత్ 5 టి20ల తర్వాత 3 వన్డేలు, 2 టెస్టులు ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment