
సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఇదే రోజు (మే26,1999) క్రికెట్ చరిత్రలో ఓ అద్భుత రికార్డు నమోదైంది. భారత దిగ్గజ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌లు సంయుక్తంగా ఈ ఘనతను అందుకున్నారు.1999 ప్రపంచకప్‌లో టాంటన్(ఇంగ్లండ్) వేదికగా శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా 157 పరుగులతో విజయం సాధించింది. కెరీర్ తొలి దశల్లో ఉన్న భారత దిగ్గజాలు గంగూలీ, ద్రవిడ్‌లు సెంచరీలతో చెలరేగి రెండోవికెట్‌కు అత్యధికంగా 318 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సృష్టించారు. ఆ సమయంలో వన్డేల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇక అప్పటి వరకు జింబాంబ్వేపై టీమిండియా దిగ్గజాలు ఆజారుద్దీన్, అజయ్ జడేజాలు పేరిట నాలుగో వికెట్‌కు నెలకొల్పిన 275 పరుగుల భాగస్వామ్యమే అత్యుత్తమం. ఈ రికార్డును గంగూలీ-ద్రవిడ్‌లు ఈ మ్యాచ్ ద్వారా అధిగమించారు. అనంతరం ఈ రికార్డును సచిన్, ద్రవిడ్‌లు 1999లోనే 372 పరుగుల భాగస్వామ్యంతో బ్రేక్ చేశారు. ప్రస్తుతం ఈ జాబితాలో వెస్టిండీస్ ఆటగాళ్లు క్రిస్‌గేల్- సామ్యుల్స్ 372 పరుగుల భాగస్వామ్యంతో తొలి స్థానంలో ఉండగా సచిన్- ద్రవిడ్‌లు రెండో స్థానంలో, గంగూలీ-ద్రవిడ్‌లు మూడో స్థానంలో ఉన్నారు.
చెలరేగిన గంగూలీ..
119 బంతుల్లో సెంచరీ సాధించిన గంగూలీ మరో 39 బంతుల్లోనే 183కు చేరుకున్నాడు. మొత్తం 158 బంతులు ఎదుర్కున్న గంగూలీ 17 ఫోర్లు, 7 సిక్స్‌లతో లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో ప్రపంచకప్ చరిత్రలో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా గంగూలీ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో 188* పరుగులతో దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు గ్యారీ కిరెస్టన్ తొలి స్థానంలో ఉన్నాడు. యునైటెడ్ ఎమిరేట్స్ జట్టుపై 1996 ప్రపంచకప్‌లో గ్యారీ కిరెస్టెన్ ఈ రికార్డును నెలకొల్పాడు.
భారత్‌కు ఇదే అత్యధికం
గంగూలీ-ద్రవిడ్‌ల భాగస్వామ్యంతో భారత్ 6 వికెట్లు కోల్పోయి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రపంచకప్ చరిత్రలో ఆ సమయంలో భారత్‌కు ఇదే అత్యుత్తమ స్కోర్. అనంతరం 2007లో బెర్ముడాపై 413 పరుగులు సాధించింది. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక రాబిన్ సింగ్ (5 వికెట్లు) దాటికి 216 పరుగులకే కుప్పకూలింది.
Comments
Please login to add a commentAdd a comment