గంగూలీ ‘క్యాబ్’ చీఫ్ అయ్యేనా?
కోల్‌కతా : దాల్మియా మరణంతో ఇటు బీసీసీఐతో పాటు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) కూడా కొత్త అధ్యక్షుడి వేటలో పడింది. ఇన్నేళ్ల పరిపాలనలో అక్కడ దాల్మియా వారసుడిగా ఎవరూ ఎదగలేకపోవడంతో పరిస్థితి సంక్లిష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా చాలా మంది భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే బాగుంటుందని భావిస్తున్నారు. అయితే ‘క్యాబ్’ సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్నా... సౌరవ్ ఇన్ని రోజులుగా పెద్దగా పరిపాలనపై దృష్టి పెట్టలేదు. అతనికి అనుభవం తక్కువ అనే అభిప్రాయం కూడా ఉంది.
ఆటగాడిగా స్టార్ హోదా ఉన్నా గంగూలీని ఎంచుకోకుండా ‘క్యాబ్’లో ఇన్నేళ్లుగా పని చేస్తున్నవారినే అధ్యక్షుడిగా చేయాలనే వాదన కూడా తెరపైకి వచ్చింది. అన్నింటికి మించి రాజకీయ కారణాలతో గంగూలీపై కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తోంది. బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు అరూప్ బిస్వాల్, సుబ్రతా ముఖర్జీ అధ్యక్ష పదవిపై కన్నేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీరికి మద్దతు ఇస్తుండటంతో ‘క్యాబ్’ అధ్యక్షుడి ఎంపిక ఆసక్తికరంగా మారింది.