భజ్జీ.. నీ అవసరం ఉంది: గంగూలీ | Ganguly Seeks Harbhajans Support Ahead Of New Innings | Sakshi
Sakshi News home page

భజ్జీ.. నీ అవసరం ఉంది: గంగూలీ

Published Thu, Oct 17 2019 11:24 AM | Last Updated on Thu, Oct 17 2019 11:44 AM

Ganguly Seeks Harbhajans Support Ahead Of New Innings - Sakshi

గంగూలీ-హర్భజన్‌ సింగ్‌(ఫైల్‌ఫొటో)

కోల్‌కతా: భారత క్రికెట్‌ జట్టులో ఒక వెలుగు వెలిగిన ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ జాతీయ జట్టు తరఫున ఆడి దాదాపు నాలుగేళ్లు కావొస్తుంది. భారత జట్టులో పోటీ పెరిగిపోవడంతో భజ్జీ కేవలం ఇంటికే పరిమితమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌ రిటైర్మెంట్‌ ఇవ్వని భజ్జీ.. ఐపీఎల్‌లో పాల్గొంటూ క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాడు. అయితే భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో హర్భజన్‌ మళ్లీ టీమిండియాకు ఆడే  అవకాశాలు కూడా లేకపోలేదు.

గతంలో భారత క్రికెట్‌ జట్టును తన దూకుడుతో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన గంగూలీ.. అప్పట్లో హర్భజన్‌ లేకుండా మ్యాచ్‌కు సిద్ధమయ్యేవాడు కాదు. అసలు హర్భజన్‌ సక్సెస్‌కు గంగూలీనే ప్రధాన కారణమనేది కాదనలేని వాస్తవం. అలానే గంగూలీ తనపై ఉంచిన నమ్మకాన్ని కూడా హర్భజన్‌ నిలబెట్టుకుంటూనే వచ్చాడు. కాగా, బీసీసీఐ అధ్యక్షుడిగా ఇక పదవీ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న గంగూలీకి భజ్జీ శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘ నువ్వొక నాయకుడివి. మిగతా వారు నాయకులు కావడానికి నాయకుడిగా నిలిచిన వాడివి. కంగ్రాట్స్‌ గంగూలీ’ అని హర్భజన్‌ ట్వీట్‌ చేశాడు.

దీనికి వెంటనే  స్పందించిన గంగూలీ.. భజ్జీ సహకారాన్ని కోరాడు. ‘ థాంక్యూ భజ్జీ.  నువ్వు ఎలాగైతే భారత్‌కు విజయాలు అందించావో అదే తరహా నీ సహకారం మాకు కావాలి. భజ్జీ.. నీ అవసరం ఉంది’ గంగూలీ బదులిచ్చాడు. మరి అంతర్జాతీయ క్రికెట్‌పై ఇంకా ఆసక్తి ఉన్న భజ్జీని మళ్లీ ఆడేందుకు గంగూలీ సహకరిస్తాడా.. లేక టీమిండియా కోచింగ్‌ స్టాఫ్‌ విభాగంలో ఏమైనా కీలక బాధ్యతలు అప్పచెబుతాడా అనేది గంగూలీ మాటల్ని బట్టి అర్థమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement