
గంభీర్, పుజారా హాఫ్ సెంచరీలు
గౌతమ్ గంభీర్, ఛటేశ్వర్ పుజారాల అర్ధసెంచరీలతో భారత మూడోటెస్టుపై పట్టు మరింత బిగించింది.
ఇండోర్: గౌతమ్ గంభీర్, ఛటేశ్వర్ పుజారాల అర్ధసెంచరీలతో భారత మూడోటెస్టుపై పట్టు మరింత బిగించింది. రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ టెస్టుల్లోకి పునరాగమనం చేసిన టీమిండియా ఓపెనర్ గంభీర్ మునుపటి ఫాంను అందుకున్నట్లు కనిపించాడు. 18/0తో రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఓపెనర్లలో మురళీ విజయ్(19) రనౌట్ గా వెనుదిరిగాడు. దీంతో మూడో రోజు ఆటలో ఆరు పరుగుల వద్ద గాయం పాలై రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన గౌతమ్ గంభీర్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు.
కివీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న గంభీర్ చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ నిలకడైన బ్యాటింగ్ తో మునుపటి ఫాంను అందుకున్నాడు. చూడచక్కనైన షాట్లు ఆడిన గంభీర్ రెండో ఇన్నింగ్స్ లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కొద్ది సేపటికే జే పటేల్ బౌలింగ్ లో మిడ్ ఆన్ లో భారీ షాట్ కు యత్నించిన గంభీర్(50) గుప్తిల్ కు దొరికిపోయాడు. దీంతో గంభీర్, పుజారాల భాగస్వామ్యానికి తెరపడింది. టెస్టుల్లో గంభీర్ కు ఇది 22వ అర్ధ సెంచరీ కాగా అతని పేరిట తొమ్మిది సెంచరీలు కూడా ఉన్నాయి.
గంభీర్ తో పాటు ఇన్నింగ్స్ ను నిలబెట్టిన పుజారా 97బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గంభీర్ వెనుదిరిగిన తర్వాత పుజారాకు భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ జతకలిశాడు. లంచ్ విరామ సమయానికి 127-2 వికెట్ల స్కోరుతో వీరిద్దరూ క్రీజులో ఉన్నారు. ఓవరాల్ గా రెండో ఇన్నింగ్స్ లో భారత్ 385 పరుగులతో ఆధిక్యంలో ఉంది.