సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది మహమ్మారి కరోనా వైరస్ బారిన పడిన వార్త క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేసింది. శనివారం తనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్దారణ అయిందని స్వయంగా ఆఫ్రిది ట్విటర్ ద్వారా పేర్కొన్నాడు. అంతేకాకుండా తను త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని విజ్ఞప్తి చేశాడు. ఇక అఫ్రిదికి కరోనా సోకిన విషయం తెలుసుకున్న మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, అభిమానులు అతడు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. (షాహిద్ అఫ్రిదికి కరోనా)
కాగా, కరోనా వైరస్ బారిన పడిన అఫ్రిది త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. ఓ టీవీషోలో పాల్గొన్న గంభీర్.. ‘ఈ మహమ్మారి వైరస్ ఎవరికీ సోకకూడదు. అఫ్రిదితో నాకు రాజకీయ పరమైన విభేదాలు ఉన్నాయి. కానీ అతడు వీలైనంత త్వరగా ఈ వైరస్ నుంచి కోలుకోవాలని ఆశిస్తున్నాను. అయితే ఆఫ్రిది కోలుకోవాలనే దానికంటే ఎక్కువగా నా దేశంలో వైరస్ బారిన పడిన ప్రతీ ఒక్కరూ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నా దేశ ప్రజల గురించే నేను ఎక్కువగా ఆలోచిస్తాను. (మాటల యుద్ధానికి ముగింపు పలకండి)
ఇక భారత్‌కు సాయం చేస్తామని పాకిస్థాన్ ముందుకొచ్చింది. అయితే వాళ్ల దేశ ప్రజలకు ముందుగా సాయం చేసుకోవాలి. అయితే వారు సాయం చేసేందుకు ముందుకు వచ్చినందుకు సంతోషమే.. కానీ సరిహద్దుల వెంట ఉగ్రవాదాన్ని ముందు పాక్ ఆపాలి’ అని సూచించారు. ఇక ఆఫ్రిది, గంభీర్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. గతంలో ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో, కశ్మీర్ అంశంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు ఆఫ్రిదిపై గంభీర్ ధ్వజమెత్తిన విషయం అందిరికీ గుర్తుండే ఉంటుంది. (‘కశ్మీర్‌ను వదిలేయ్.. నీ విఫల దేశాన్ని చూసుకో’)
Comments
Please login to add a commentAdd a comment