న్యూఢిల్లీ: అసలు భారత్ క్రికెట్ జట్టు తరఫున ఎంఎస్ ధోని తిరిగి ఆడతాడా.. లేదా అనే విషయాన్ని సెలక్టర్లు సాధ్యమైనంత తొందరగా అడిగి తెలుసుకోవాలని ఇటీవల సూచించిన మాజీ ఓపెనర్ గౌతం గంభీర్.. మరోసారి ధోనినే టార్గెట్‌గా మండిపడ్డాడు. ధోని విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఏం చేస్తుందని ప్రశ్నించాడు. ధోని కంటే దేశం ముఖ్యమనే విషయం తెలియదా అంటూ నిలదీశాడు. ఎవరికైనా రిటైర్మెంట్ అనేది తమ వ్యక్తిగత విషయమని పేర్కొన్న గంభీర్.. ధోని వీడ్కోలు పలుకుతానని చెప్పేవరకూ నిరీక్షిస్తూనే ఉంటారా అని ప్రశ్నించాడు.
‘వచ్చే వరల్డ్‌కప్‌లో ధోనిని చూస్తానని నేను అనుకోవడం లేదు. ఆ సమయానికి కెప్టెన్‌గా ఎవరున్నా ధోని మాత్రం జట్టులో ఉండటం అనేది జరగదు.. అప్పటికి కెప్టెన్‌గా కోహ్లి ఉంటాడా లేదా అనేది తెలియదు. కాకపోతే నువ్వు వచ్చే వరల్డ్‌కప్‌లో ఉండవని ధోనికి చెప్పడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి. ప్రస్తుతం యువ క్రికెటర్లను పరీక్షిస్తున్నది ఏదైతే ఉందో అది దేశం కోసం మాత్రమే తప్ప ధోని కోసం కాదు. యువ క్రికెటర్లను పరీక్షించడానికి ధోని తమకు ఒక అవకాశం ఇచ్చాడని సెలక్టర్లు చెప్పడం విడ్డూరంగా ఉంది. వచ్చే వరల్డ్‌కప్ భారత్ గెలవాలంటే ఇప్పట్నుంచే అందుకు సంసిద్ధం కావాలి. రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లతో పాటు మిగతా యువ వికెట్ కీపర్లకు అవకాశం ఇవ్వాలి. ఇక భారత క్రికెట్ జట్టు.. ధోనిని దాటి చూడాల్సిన సమయం వచ్చేసింది’ అని గంభీర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment