
సింధు, మిథాలీలకు ఘనసన్మానం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్న పలువురు క్రీడాకారులు, వెటరన్ ఆటగాళ్లను దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) ఘనంగా సన్మానించింది. ఇటీవలే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు, భారత మహిళా క్రికెట్ సారథి మిథాలీ రాజ్‌లతో పాటు అథ్లెట్ జె.జె.శోభ, కబడ్డీ క్రీడాకారిణులు తేజస్విని బాయి, మమతలు సన్మానం పొందిన వారిలో ఉన్నారు. వెటరన్ వాలీబాల్ ప్లేయర్, సింధు తండ్రి అయిన పి.వి.రమణ, రవికాంత్ రెడ్డిలను కూడా సత్కరించారు.
సికింద్రాబాద్‌లోని రైల్వే ఆఫీసర్స్ క్లబ్‌లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్‌సీఆర్ జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ క్రీడాకారులను సత్కరించి మెమెంటో ప్రదానం చేశారు. భవిష్యత్తులోనూ భారత క్రీడాకారులు దేశానికి ఘనవిజయాలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.
భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడంలో రైల్వే శాఖ ముందుందని, ఉద్యోగాలు, పదోన్నతులతో సత్కరిస్తోందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్, వాలీబాల్ మాజీ ఆటగాడు శ్యామ్‌సుందర్ రావు, రైల్వే ఉన్నతాధికారులు ఎస్.కె.అగర్వాల్, గజానన్ మాల్యా, రాకేశ్ అరోణ్, శివప్రసాద్, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.