
మిథాలీ, సింధు ‘పద్మశ్రీ’లు
రెజ్లింగ్ కోచ్ సత్పాల్ సింగ్‌కు పద్మభూషణ్
న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ యువ క్రీడాకారిణి పీవీ సింధు ప్రతిష్టాత్మక పౌర పురస్కారం ‘పద్మశ్రీ’కి ఎంపికయ్యారు. ఆదివారం ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వీరిద్దరికి ఈ గౌరవం దక్కింది. దాదాపు పదిహేనేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 32 ఏళ్ల మిథాలీ 10 టెస్టులు, 153 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది.
సుదీర్ఘ కాలంగా జట్టు కెప్టెన్‌గా కూడా కొనసాగుతున్న ఈ క్రికెటర్, గతేడాది ఇంగ్లండ్ గడ్డపై భారత్‌కు చరిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందించింది. 20 ఏళ్ల సింధు వరుసగా రెండేళ్ల పాటు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యాలు గెలిచి సంచలనం సృష్టించింది. 2014 ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ క్రీడల్లో కూడా ఆమె పతకాలు సాధించింది.
ధోని, కోహ్లిలకు దక్కలేదు...
భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్, హాకీ క్రీడాకారిణి సబా అంజుమ్ కరీమ్, వికలాంగ క్రీడాకారిణి అరుణిమ సిన్హాలకు కూడా ‘పద్మశ్రీ’ దక్కింది. అయితే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని, విరాట్ కోహ్లిలకు మాత్రం నిరాశే ఎదురైంది. పద్మభూషణ్‌కు ధోని పేరును, పద్మశ్రీకి కోహ్లి పేరును బీసీసీఐ ప్రతిపాదించింది.
సుశీల్‌కూ లేదు...
వివాదం సృష్టించిన పద్మభూషణ్ అవార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సుశీల్ కుమార్, సైనా నెహ్వాల్ ఇద్దరినీ పక్కన పెట్టింది. సుశీల్ పేరును ప్రతిపాదించడంపై నిబంధనలు చూపిస్తూ సైనా అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వీరిని కాదని మాజీ రెజ్లర్ సుశీల్ కోచ్, మామ కూడా అయిన సత్పాల్ సింగ్‌ను పద్మభూషణ్‌కు ఎంపిక చేసింది. 59 ఏళ్ల సత్పాల్ 1974, 1982 ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచారు. ఆయనకు 1983లోనే పద్మశ్రీ, 2009 ద్రోణాచార్య అవార్డులు దక్కాయి. కోచ్‌గా సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ సహా పలువురు అగ్రశ్రేణి రెజ్లర్లను తీర్చి దిద్దిన ఘనత సత్పాల్ సొంతం.
ఊహించలేదు...
చాలా సంతోషంగా ఉంది. నామినేషన్లలో ఉన్నా నేను అవార్డుకు ఎంపికవుతానని అస్సలు ఊహించలేదు. ఇంత చిన్న వయసులోనే పద్మశ్రీలాంటి పురస్కారం దక్కడం పట్ల గర్వ పడుతున్నా. భవిష్యత్తులో మరింత బాగా ఆడేందుకు ఇది స్ఫూర్తినిస్తుంది.
-‘సాక్షి’తో పీవీ సింధు