ఇస్లామాబాద్: తన అద్భుత ప్రదర్శనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న పాకిస్తాన్ మాజీ స్పిన్ దిగ్గజం సక్లయిన్ ముస్తాక్ వరల్డ్ కప్ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 1999 ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్ సందర్భంగా టీం మేనేజర్లకు పట్టుబడకుండా చేసిన తుంటరి పనిని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. (పదవి నుంచి వైదొలిగిన శశాంక్ మనోహర్ )
'నేను డిసెంబర్ 1998లో వివాహం చేసుకున్నాను. నా భార్య అప్పుడు లండన్‌లో ఉండేది. అయితే వరల్డ్ కప్ సందర్భంగా ఆటగాళ్ల కుటుంబాలను కూడా అనుమతించారు. కానీ అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియదు కానీ తిరిగి ఇంటికి పంపాల్సిందిగా మాకు సూచనలు అందాయి. అప్పటివరకు సంతోషంగా ఉన్నా ఆకస్మికంగా చోటుచేసుకున్న ఈ మార్పులపై మా హెడ్ కోచ్ రిచర్డ్ పైబస్‌తో మాట్లాడాను. కానీ ఫలితం లేదు. వెంటనే కుటుంబసభ్యులను వెనక్కి పంపాల్సింతే అన్నారు. అంతా సజావుగా జరుగుతున్న సమయంలో ఎటువంటి కారణం లేకుండా నా భార్యను వెనక్కి పంపాలనుకోలేదు. దీంతో రూల్స్ బ్రేక్ చేసి తనను ఇంటికి పంపించాను అని అబద్ధమాడాను. జట్టు మేనేజర్, ఇతర అధికారులు తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు తనని ఓ అల్మరాలో దాక్కోమని చెప్పాను.
అయితే ఓ రోజు ఆట గురించి డిస్కస్ చేయడానికి కొంతమంది ఆటగాళ్లు నా రూంకి వచ్చారు. అలా మాట్లాడుకుంటుండగా వారికి నా గదిలో ఎవరో ఉన్నారనే అనుమానం కలిగింది. దీంతో తనని బయటకు రావాల్సిందిగా కోరాను. మా స్నేహితులు కూడా ఈ విషయాన్ని బయటికి రానివ్వలేదు. అయితే ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ ఓడిపోయినప్పడు కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆటగాళ్లందరం బాగా డీలా పడిపోయాం. ఆ సమయంలో నేను వెంటనే హోటల్ రూంకి వెళ్లి తనని తిరిగి లండన్‌కి పంపించాను' అంటూ వరల్డ్ కప్ అనుభవాలను సక్లయిన్ ముస్తాక్ పంచుకున్నారు. ఇప్పటివరకు 49 టెస్టులు ఆడిన సక్లయిన్ ముస్తాక్ 169 వన్డేల్లో వరుసగా 208, 288 వికెట్లు పడగొట్టారు. ('ఆ ఆలోచన సచిన్‌దే.. చాపెల్‌ది కాదు' )
Comments
Please login to add a commentAdd a comment