బెంగళూరు: ఇటు బ్యాటింగ్ మెరుపులు... అటు వర్షపు చినుకులతో చిన్నస్వామి స్టేడియం తడిసిపోయింది. ఈ క్రికెట్ మ్యాచ్ అభిమానుల్ని పరుగుల మజాలో ముంచింది. కానీ ఈ మజాను పూర్తిగా చవిచూడకముందే వర్షంతో ఆగిన ఆటలో డక్‌వర్త్ లూయిస్ (డీఎల్) పద్ధతి పాకిస్తాన్‌ను విజేతను చేస్తే... 400 పైచిలుకు చేసిన న్యూజిలాండ్ పరాజితగా మిగిలింది. పాక్ 21 పరుగులతో గెలిచి సెమీస్ అవకాశాలు సజీవంగా నిలబెట్టుకుంది.
మొదట కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోరు చేసింది. రచిన్ రవీంద్ర (94 బంతుల్లో 108; 15 ఫోర్లు, 1 సిక్స్) ఈ టోర్నీలో మూడో సెంచరీ సాధించగా, గాయంనుంచి కోలుకొని బరిలోకి దిగిన కేన్ విలియమ్సన్ (79 బంతుల్లో 95; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. తర్వాత పాకిస్తాన్ కష్టమైన లక్ష్యం వైపు ధాటిగా దూసుకెళ్లింది. వానతో మ్యాచ్ నిలిచేసరికి 25.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది.
అప్పటి డక్‌వర్త్ లెక్కల ప్రకారం 25.3 ఓవర్లలో 179 చేస్తే కివీస్‌పై గెలుపు ఖాయం. కానీ పాక్ ఇంకో 21 పరుగులు ముందంజలో ఉంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫఖర్ జమాన్ (81 బంతుల్లో 125 నాటౌట్, 8 ఫోర్లు, 11 సిక్స్‌లు) సిక్సర్లతో విరుచుకుపడి సెంచరీ సాధించాడు. కెపె్టన్ బాబర్ అజమ్ (63 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీ సాధించాడు. కివీస్ ఓటమితో దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు చేరింది.
చెలరేగిన రచిన్, విలియమ్సన్
ముందుగా కివీస్ ఓపెనర్లు కాన్వే (39 బంతుల్లో 35; 6 ఫోర్లు), రచిన్ రవీంద్ర తొలి వికెట్‌కు 68 పరుగులతో చక్కని ఆరంభమిచ్చారు. కాన్వే అవుటయ్యాక... రచిన్‌కు కెప్టెన్ విలియమ్సన్ జతయ్యాక పరుగుల వేగం పెరిగింది. ఇద్దరి స్ట్రోక్‌ప్లేతో బౌండరీలు మంచినీళ్ల ప్రాయంలా వచ్చేశాయి. 16వ ఓవర్లో జట్టు వంద పరుగులు చేరుకుంటే... కాసేపటికే 29 ఓవర్లోనే స్కోరు 200 దాటేసింది. ఆలోపే రవీంద్ర, విలియమ్సన్ చకచకా ఫిఫ్టీలు పూర్తిచేసుకొని శతకాలపై కన్నేశారు.
ఈ క్రమంలో రచిన్ 88 బంతుల్లో సఫలం చేసుకోగా, విలియమ్సన్ 5 పరుగుల దూరంలోనే నిష్క్రమించాడు. దీంతో రెండో వికెట్‌కు 180 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన వారంతా తలా ఒక చేయి వేయడంతో కివీస్ స్కోరు 400 దాటింది. ఫిలిప్స్ (25 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), చాప్‌మన్ (27 బంతుల్లో 39; 7 ఫోర్లు), మిచెల్ (18 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్), సాన్‌ట్నర్ (17 బంతుల్లో 26 నాటౌట్; 2 సిక్స్‌లు) మెరుగ్గా ఆడారు.
ఫఖర్ విధ్వంసం
వర్షంతో ఆగి..సాగిన మ్యాచ్‌లో చివరకు పాక్ విజయ లక్ష్యాన్ని డీఎల్ పద్ధతిలో 41 ఓవర్లలో 342 పరుగులుగా నిర్దేశించారు. అంటే సగటున ప్రతి ఓవర్‌కు 8 పరుగుల పైచిలుకే చేసుకుంటూ పోవాలి. ఇది వన్డేలో కొండంత లక్ష్యం. దీన్ని ఓపెనర్ ఫఖర్ జమాన్ విధ్వంసం కరిగించేలా చేసింది. మరో ఓపెనర్ షఫీక్ (4) వికెట్ పారేసుకున్నా... కెపె్టన్ బాబర్ ఆజమ్‌తో ధనాధన్ ఛేదనకు శ్రీకారం చుట్టాడు.
4 ఓవర్లలో 12/1 స్కోరుతో ఉన్నప్పుడు పాక్ ఇంకేం ఛేదిస్తుందిలే అనుకున్నారంతా! కానీ తర్వాత ఫఖర్ బ్యాట్ సిక్సర్లతో శివమెత్తడంతో న్యూజిలాండ్ ప్రధాన బౌలింగ్ దళమంతా కకావికలమైంది. ఒక ఓవర్లో 17, మరో ఓవర్లో 16, ఇంకో రెండు ఓవర్లలో 15 చొప్పున పరుగులు రావడంతో పాక్ స్కోరు ఒక్కసారిగా పుంజుకుంది. 20వ ఓవర్ రెండో బంతికే ఫఖర్ (63 బంతుల్లోనే) సెంచరీ పూర్తయింది.
అప్పటికి జట్టు స్కోరు 145 పరుగులైతే ఇందులో వంద అతనొక్కడే చేశాడంతే ఫఖర్ బ్యాటింగ్ సునామీ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బాబర్ కూడా 52 బంతుల్లో అర్ధ శతకం సాధించగా, 26వ ఓవర్లో మళ్లీ వానొచ్చింది. ఆ తర్వాత తిరిగి కొనసాగలేదు. చిత్రమేమిటంటే సోధి వేసిన 25వ ఓవర్లోనే బాబర్ ఒక సిక్స్, ఫఖర్ రెండు సిక్సర్లతో 20 పరుగులు పిండుకున్నారు. ఆ తర్వాత 3 బంతులకే ఆట ఆగిపోయింది. అంటే 25వ ఓవరే ఫలితాన్ని తలకిందులు చేసింది! ఆ ఓవర్ కంటే ముందు ఆగిపోతే కివీసే గెలిచేది!
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) రిజ్వాన్ (బి) హసన్ 35; రచిన్ (సి) షకీల్ (బి) వసీమ్ 108; విలియమ్సన్ (సి) ఫఖర్ (బి) ఇఫ్తికార్ 95; మిచెల్ (బి) రవూఫ్ 29; చాప్‌మన్ (బి) వసీమ్ 39; ఫిలిప్స్ (బి) వసీమ్ 41; సాన్‌ట్నర్ నాటౌట్ 26; లాథమ్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 401. వికెట్ల పతనం: 1–68, 2–248, 3–261, 4–318, 5–345, 6–388. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 10–0–90–0, హసన్ అలీ 10–0–82–1, ఇఫ్తికార్ 8–0–55–1, రవూఫ్ 10–0–85–1, వసీమ్ 10–0–60–3, సల్మాన్ 2–0–21–0.
పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (సి) విలియమ్సన్ (బి) సౌతీ 4; ఫఖర్ నాటౌట్ 126; బాబర్ నాటౌట్ 66; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (25.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 200/1. వికెట్ల పతనం: 1–6, బౌలింగ్: బౌల్ట్ 6–0–50–0, సౌతీ 5–0–27–1, సాన్‌ట్నర్ 5–0–35–0, ఫిలిప్స్ 5–1–42–0, ఇష్ సోధి 4–0–44–0, మిచెల్ 0.3–0–1–0.
Comments
Please login to add a commentAdd a comment