ఆస్టిన్ (అమెరికా): మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ లాంఛనం పూర్తి చేశాడు. ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయం అవ్వాలంటే టాప్–8లో నిలవాల్సిన రేసులో... అతను రెండో స్థానాన్ని సాధించి ఆరోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యునైటెడ్ స్టేట్స్ (యూఎస్) గ్రాండ్‌ప్రి రేసులో ఐదో స్థానం నుంచి డ్రైవ్ చేసిన హామిల్టన్ చివరకు రెండో స్థానంలో నిలిచాడు. 56 ల్యాప్‌ల ఈ రేసులో ‘పోల్ పొజిషన్’ నుంచి రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ గంటా 33 నిమిషాల 55.653 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. 21 రేసుల ప్రస్తుత సీజన్‌లో 19 రేసులు ముగిశాక హామిల్టన్ 381 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. హామిల్టన్ సహచరుడు బొటాస్ 314 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో మరో రెండు రేసులు (బ్రెజిల్, అబుదాబి గ్రాండ్‌ప్రి) మిగిలి ఉన్నా హామిల్టన్‌కు, బొటాస్‌కు మధ్య 67 పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఈ రెండు రేసుల్లో బొటాస్ గెలిచినా హామిల్టన్‌ను అందుకునే పరిస్థితి లేదు.
తాజా ప్రదర్శనతో ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో అత్యధిక ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్స్ సాధించిన రెండో డ్రైవర్‌గా హామిల్టన్ గుర్తింపు పొందాడు. గతంలో హామిల్టన్ 2008, 2014, 2015, 2017, 2018లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. జర్మనీ దిగ్గజ డ్రైవర్ మైకేల్ షుమాకర్ అత్యధికంగా ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఇదే జోరు కొనసాగిస్తే 34 ఏళ్ల హామిల్టన్ వచ్చే ఏడాది షుమాకర్ రికార్డును సమం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment