'ఆటగాడిగా ఉన్నా సంతోషమే'
మిర్పూర్: ఆటకైనా, మాటకైనా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకునే టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తనదైన శైలిలో స్పందించాడు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన రెండు వన్డేల్లోనూ ఘోర ఓటమిని చవిచూసి సిరీస్ ను కోల్పోయిన టీమిండియాపై విమర్శలు ఇంకా ఊపందుకోకముందే ధోనీ తన మనసులోని మాటను చెప్పకనే చెప్పాడు. అవసరమైతే టీమిండియా కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. 'కెప్టెన్సీ నుంచి బయట రావడాన్ని కూడా ఆస్వాదిస్తా. భారత క్రికెట్ టీమ్ లో ఏ విధమైన చెడు జరిగినా అందుకు నేను కూడా ఒక బాధ్యుణ్నే. బోర్డు పెద్దలు నన్ను ఆటగాడిగా పరిమితం చేసినా ఇబ్బందేమీ లేదు' అని ధోనీ వ్యాఖ్యానించాడు. ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో ఓటమి పాలైన అనంతరం ధోనీ మాట్లాడుతున్న సమయంలో ఊహించని ప్రశ్న ఒకటి ఉక్కిరిబిక్కిరి చేసింది.
టీమిండియా కెప్టెన్ గా ఎంతకాలం కొనసాగవచ్చని అనుకుంటున్నారు?అని ధోనీని అడగ్గా.. ప్రస్తుతం అయితే కెప్టెన్ గా ఉన్నా.. భవిష్యత్తులో జరిగే పరిస్థితులైతే తనకు తెలియదన్నాడు. 'నేను క్రికెట్ ను ఎంజాయ్ చేస్తున్నా. క్రికెట్ కెప్టెన్ గా ఎంతకాలం ఉంటారని ప్రశ్న ఏదో ఒక రోజు వస్తుందనే విషయం నాకు తెలుసు. నన్ను మీడియా ప్రేమించింది. నా వల్లే టీమిండియా ఓడిపోతుందని మీరు భావించినట్లైయితే.. నేను కెప్టెన్ గా తప్పుకుంటే టీమిండియా క్రికెట్ అభివృద్ది చెందుతుందని మీరు నిర్ణయిస్తే తప్పకుండా ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతా' అని ధోనీ స్పష్టం చేశాడు. జట్టుకు ఎవరు కెప్టెన్ అనేది ఎప్పుడూ సమస్య కానే కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నాడు. ఆటగాడిగానైనా జట్టులో ఉండేందుకు సిద్ధంగా ఉన్నానని ధోనీ తెలియజేశాడు.