టీమిండియాకు బాస్ అతనే: అనిల్ కుంబ్లే
బెంగళూరు: టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ ఆయన. అంతేకాకుండా కెప్టెన్‌గా, జట్టు సభ్యుడిగా కూడా సేవలందించారు. 18 ఏళ్ల క్రికెట్‌లో కొనసాగి.. అత్యుత్తమ స్పిన్నర్‌గా పేరొందిన ఆయనే అనిల్ కుంబ్లే. ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్‌గా కుంబ్లే సరికొత్త అవతారంలో జట్టుకు సేవలందిస్తున్నారు. కోచ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా టీమిండియాతో కలిసి ఆయన వెస్టిండీస్‌లో పర్యటించారు. ఈ పర్యటన ముగించుకొని టీమిండియా భారత్ చేసుకున్న నేపథ్యంలో ఆయన ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కోచ్‌గా తన తొలి అసైన్‌మెంట్ ఫలప్రదంగా ముగిసిందని, వెస్టిండీస్‌లో టీమిండియా చక్కని ప్రదర్శన కనబర్చిందని కుంబ్లే ఆనందం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పర్యటనలతో పోల్చుకుంటే వెస్టిండీస్ పర్యటన అంత కష్టసాధ్యంగా ఉండదని, అయినప్పటికీ వెస్టిండీస్ తన అసైన్‌మెంట్ తొలి కావడం మంచిదేనని భావిస్తున్నట్టు చెప్పారు.
ఇన్నాళ్ల తన కెరీర్‌లో చాలామంది కోచ్‌లను చూశానని, అయితే, ఎక్కువకాలం కలిసి పనిచేయడంతో కోచ్‌గా జాన్ రైట్ తనపై ప్రభావం చూపించారని, ఆయన స్ఫూర్తి తనపై ఉండొచ్చునని చెప్పారు. జాన్ రైట్ జట్టు వెనుక ఉండి చెప్పిన విషయాలను ఇప్పుడు తాను కూడా చెప్తున్నట్టు గుర్తుచేసుకున్నారు. టీమిండియాకు సంబంధించినంతవరకు బాసే కెప్టెన్ అని, అతనికి సహకారం అందించడం, నిర్ణయాలు తీసుకునేందుకు, వ్యూహాలు రచించేందుకు అండగా నిలబడటం కోచ్ బాధ్యత అని చెప్పారు. ప్రస్తుత జట్టు ఎంతో నిబద్ధతతో ఆడుతోందని, ఎంతో నైపుణ్యంతో జట్టు సభ్యులు అద్భుతంగా ఆడుతున్నారని, దీంతో కోచ్‌గా తనకు ఎంతో అనువైన వాతావరణం ఉందని వివరించారు.