అనిల్ కుంబ్లే సంచలన నిర్ణయం!
న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బీసీసీఐ తీరుపై తీవ్ర మనస్తాపంతో ఆయన మంగళవారం సాయంత్రం కోచ్ పదవికి రాజీనామా చేశాడు. మంగళవారం టీమిండియాతోపాటు ఆయన వెస్టిండీస్ పర్యటనకు వెళ్సాల్సి ఉంది. అయినా, ఈ పర్యటనకు దూరంగా భారత్‌లోనే ఉండిపోయిన కుంబ్లే ఎవరూ ఊహించనిరీతిలో తన రాజీనామాను ప్రకటించాడు. గత కొన్నాళ్లుగా కెప్టెన్ విరాట్ కోహ్లితో కుంబ్లేకు తీవ్ర విభేదాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా కుంబ్లే రాజీనామా చేయడం గమనార్హం.
అనిల్ కుంబ్లే టీమిండియా కోచ్ పదవి చేపట్టి ఏడాది మాత్రమే అయింది. సహజంగానే ఈ స్పిన్ దిగ్గజానికి కోచ్‌గా మరో ఏడాది పొడిగింపు ఇస్తారని అంతా భావించారు. కోచ్‌గా జట్టుకు కుంబ్లే అద్భుతమైన విజయాలు అందించాడు. అయినప్పటికీ కెప్టెన్ కోహ్లితోపాటు ఇతర జట్టు సభ్యులు కుంబ్లేను వ్యతిరేకించడంతో ఆయనకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. కోచ్ పదవి కోసం మళ్లీ ఇంటర్వ్యూలు చేపడుతున్నట్టు ప్రకటించింది. కొత్త కోచ్‌ను నియమించబోతున్నట్టు చెప్పకనే చెప్పింది. అయినా.. కుంబ్లే మరోసారి కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూకు దరఖాస్తు చేసుకున్నాడు. భారత జట్టుకు కోచ్‌గా సేవలు అందించేందుకు తాను సుముఖంగా ఉన్నట్టు మరోసారి చాటాడు. అయినా టీమిండియాలో తిరుగులేని పట్టు కలిగిన కెప్టెన్ కోహ్లి పంతమే నెగ్గింది. కుంబ్లే కోచ్ పదవి నుంచి వైదొలగక తప్పలేదు.
చదవండి: కుంబ్లేతో పెట్టుకొని.. భారీ మూల్యమే చెల్లించాడు!
చదవండి: ధోనీ, యువీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు!