న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌లో శనివారం అఫ్గానిస్తాన్‌తో జరుగనున్న మ్యాచ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాలని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన తుది జట్టునే అఫ్గానిస్తాన్‌తో కొనసాగించాలంటూ పేర్కొన్నాడు. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు మార్పులు చేయకుండా విరాట్ గ్యాంగ్ పోరుకు సిద్ధమవుతుందనే తాను ఆశిస్తున్నానని భజ్జీ తెలిపాడు.
‘నేను గత మ్యాచ్‌లో చూసిన కాంబినేషన్‌కే కట్టుబడి ఉన్నా. తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న భువనేశ్వర్ స్థానంలో మహ్మద్ షమీ రావడం ఖాయం. అంతకుమించి మార్పులు ఏమీ ఉండవనేది నా అభిప్రాయం. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకుని కాంబినేషన్‌లో ఏమైనా మార్పులు చేయడం అంత మంచిది కాదు. అఫ్గాన్‌తో పోరుకు ధావన్ స్థానంలో ఎవర్ని తుది జట్టులోకి తీసుకోవాలనే దానిపై ఇప్పటికే టీమిండియా యాజమాన్యానికి ఒక స్పష్టత వచ్చే ఉంటుంది. ఇక్కడ మీ మొదటి చాయిస్ శంకర్‌కే ఉంటుందని అనుకుంటున్నా. పాక్‌తో పోరులో శంకర్ తన స్థానానికి న్యాయం చేశాడు. అందుచేత విజయ్ శంకర్‌నే తుది జట్టులో ఎంపిక చేయడం ఉత్తమం. అనవసరంగా మార్పులు చేయకండి’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
అదే సమయంలో వరల్డ్‌కప్‌లో భారత జట్టు నాలుగు వందల పరుగుల మార్కును చేరుతుందని హర్భజన్ ధీమా వ్యక్తం చేశాడు. మనకున్న బలాన్ని చూస్తే 400 పరుగులు సాధించడం కష్టం కాదన్నాడు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల వంటి హిట్టర్లతో నిండి ఉన్న భారత జట్టు ఆ ఫీట్‌ను కచ్చితంగా చేరుతుందన్నాడు. ఇక వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కొట్టిన అత్యధిక వ్యక్తిగత సిక్సర్ల రికార్డును(17 సిక్సర్లు) కూడా బ్రేక్ చేసే సత్తా భారత ఆటగాళ్లకు ఉందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment