ముంబై : ప్రపంచకప్‌కు యువ సంచలన ఆటగాడు రిషభ్ పంత్‌ను సెలక్టర్లు పక్కనపెట్టడం పట్ల మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచకప్‌కు పంత్‌ను ఎంపికచేయకపోవడం పట్ల సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు. యువ కీపర్ పంత్‌ను కాదని 33 ఏళ్ల దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేయడమేంటని సెలక్టర్లను ప్రశ్నిస్తున్నారు. పంత్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని కామెంట్ చేస్తున్నారు. తాజాగా సెలక్టర్ల తీరును మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తప్పుపట్టారు.
‘ప్రస్తుతం ఎంపిక చేసిన ఆటగాళ్లలో ఓపెనర్ శిఖర్ ధావన్ మినహా స్పెషలిస్టు ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్ ఎవరూ లేరు. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ ఉంటే ప్రత్యర్థి జట్టు గందరగోళానికి గురవుతుంది. కొంతమంది బౌలర్లు కూడా ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేయడానికి ఇబ్బందులు పడతారు. గత కొంతకాలంగా టీమిండియా తరుపున పంత్ విశేషంగా రాణిస్తున్నాడు. ఆటగాడిగా ఎంతో పరిణితి సాధించాడు. ఇక ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు పంత్ 245 పరుగులు చేయగా, కార్తీక్ 111 పరుగులే చేశాడు. ప్రస్తుతం ఆటగాళ్ల ఫామ్‌ను చూడకుండా ఎలా ఎంపిక చేస్తారు?. సెలక్టరు పంత్‌ను ఎంపిక చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడం మంచి నిర్ణయం’అంటూ సునీల్ గవాస్కర్ వివరించారు.
ఇక పంత్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. దినేశ్ కార్తీక్ తో పోలిస్తే పంత్ క్రికెట్ అనుభవం చాలా తక్కువని ఎమ్మెస్కే పేర్కొన్నారు. ఐపీఎల్ ఆటతీరును బట్టి చూస్తే కూడా పంత్ కంటే కార్తీక్ అద్భుతంగా రాణిస్తున్నాడన్నారు. ఇక కేవలం ధోని గాయపడి జట్టుకు దూరమైన సమయంలోనే సెకండ్ వికెట్ కీపర్ అవసరముంటుందని అభిప్రాయపడ్డారు. కాబట్టి ఇలాంటి సమయంలో సీనియర్ ఆటగాడు వికెట్ కీపర్ గా వ్యవహరిస్తే బావుంటుందనే దినేశ్ కార్తిక్ ను ఎంపికచేసినట్లు ఎమ్మెస్కే వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment