భజ్జీ వచ్చేశాడు | Harbhajan sing returned | Sakshi
Sakshi News home page

భజ్జీ వచ్చేశాడు

Published Thu, May 21 2015 3:09 AM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM

భజ్జీ వచ్చేశాడు

భజ్జీ వచ్చేశాడు

భారత టెస్టు జట్టులో హర్భజన్ సింగ్  
రవీంద్ర జడేజా వన్డేలకే పరిమితం
టెస్టులకు కోహ్లి, వన్డేలకు ధోని సారథ్యం
బంగ్లాదేశ్ పర్యటనకు జట్టు ఎంపిక

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ఏకైక టెస్టు ఫతుల్లాలో జూన్ 10 నుంచి 14 వరకు జరుగుతుంది.
జూన్ 18, 21, 24 తేదీల్లో మిర్పూర్‌లో మూడు వన్డేలు జరుగుతాయి.

 
 ముంబై : రెండేళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ... అందుబాటులో ఉన్న ప్రతి టోర్నీ ఆడుతూ... భారత జట్టులోకి రావడానికి హర్భజన్ చేసిన విశ్వప్రయత్నాలు ఫలించాయి. బంగ్లాదేశ్‌లో పర్యటించే భారత జట్టులో 34 ఏళ్ల ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్‌కు చోటు దక్కింది. సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ బుధవారం సమావేశమై టెస్టులకు, వన్డేలకు జట్టును ఎంపిక చేసింది. టెస్టు జట్టులోంచి రవీంద్ర జడేజాను తప్పించారు. వన్డేలకు ధోని, టెస్టులకు కోహ్లి సారథ్యం వహిస్తారు. ప్రపంచకప్ ఆడిన జట్టులో ఉన్న షమీ గాయం నుంచి కోలుకోకపోవడంతో... ఆ టోర్నీలో రిజర్వ్‌గా వ్యవహరించిన ధావల్ కులకర్ణి జట్టులోకి వచ్చాడు. ఇంతకుమించి ఎలాంటి మార్పులు, సంచలనాలు లేకుండా భారత జట్టును ప్రకటించారు.
 
 ‘మళ్లీ భారత జట్టులోకి రావడం నాకు కొత్త ఆరంభం. ఈ ఇన్నింగ్స్‌ను ఆత్మవిశ్వా సంతో ప్రారంభిస్తా. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటా. నన్ను ఇష్టపడే అనేకమంది ఆశీస్సులు నాతో ఉన్నాయి. రెండేళ్లుగా ఈ రోజు కోసమే కష్టపడుతున్నా. మళ్లీ జట్టులోకి వస్తాననే నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. మరో నాలుగైదేళ్లు ఆడే సత్తా నాలో ఉంది. కాబట్టి రిటైర్మెంట్ ఆలోచన ఎప్పుడూ రాలేదు. సచిన్, కుంబ్లే ఇద్దరూ నాలో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారు. కచ్చితంగా నేను తిరిగి జట్టులోకి వస్తానని సచిన్ ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. కష్టకాలంలో నాకు అండగా నిలబడ్డ వాళ్లందరికీ కృతజ్ఞతలు.’
  -హర్భజన్
 
 ‘బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్‌లో ఎక్కువ మంది ఎడంచేతి వాటం ఆటగాళ్లు ఉన్నందున జట్టులో ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు ఉండాలని భావించాం. ఈ విషయంలో కెప్టెన్ కోహ్లి అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం. అదే సమయంలో ఇతర యువ ఆఫ్ స్పిన్నర్ల గురించి కూడా చర్చించినా, హర్భజన్‌వైపే మొగ్గు చూపాం. యువరాజ్ గురించి చర్చ జరగలేదు. సెలక్షన్ కమిటీ దేశంలోని క్రికెటర్లందరికీ న్యాయం చేయాలి. ఇందులో భావోద్వేగాలకు తావులేదు. విశ్రాంతి కావాలని సీనియర్ క్రికెటర్లెవరూ కోరలేదు. అందరూ అందుబాటులో ఉన్నందున పూర్తిస్థాయి జట్టును ఎంపిక చేశాం.’
 -సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్
 
 ‘హర్భజన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. జట్టులో చోటుకు తను అర్హుడు. 700 అంతర్జాతీయ వికెట్లు తీసిన బౌలర్ ఎవరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. బాగా ఆడితే సీనియర్లు కూడా తిరిగి జట్టులోకి రావచ్చనే సంకేతం వచ్చింది. ఇటీవల బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడుతోంది. కాబట్టి పూర్తిస్థాయి జట్టుతో వెళ్లడమే మంచిది’   - గవాస్కర్
 
  టెస్టు జట్టు : కోహ్లి (కెప్టెన్), విజయ్, ధావన్, కేఎల్ రాహుల్, పుజారా, రహానే, రోహిత్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అశ్విన్, హర్భజన్, కరణ్ శర్మ, భువనేశ్వర్, ఉమేశ్, ఆరోన్, ఇషాంత్.
 
 వన్డే జట్టు: ధోని (కెప్టెన్), రోహిత్, రహానే, ధావన్, కోహ్లి, రైనా, రాయుడు, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, భువనేశ్వర్, ఉమేశ్, మోహిత్ శర్మ, స్టువర్ట్ బిన్నీ, ధావల్ కులకర్ణి.
 
 ‘మార్పు’ కలిసొచ్చిందా?
 సరిగ్గా 2 సంవత్సరాల 2 నెలల 15 రోజులు... హర్భజన్ సింగ్ భారత జట్టు తరఫున చివరి టెస్టు 2013 మార్చిలో హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో ఆడాడు. ఆ తర్వాత  జట్టుకు దూరమయ్యాడు. మళ్లీ తిరిగి హర్భజన్ జట్టులోకి వస్తాడనే అంచనా కూడా పెద్దగా ఎవరికీ లేదు. సెహ్వాగ్, గంభీర్, యువరాజ్‌లతో పాటు భజ్జీ అంతర్జాతీయ కెరీర్ కూడా ముగిసినట్లే అని భావించారు. కానీ అనూహ్యంగా ఈ ‘టర్బోనేటర్’ తిరిగి జట్టులోకి వచ్చాడు. దీని వెనక కారణాలు ఏంటి?

జట్టుకు దూరమయ్యాక హర్భజన్ ప్రదర్శన అంత పేలవంగా లేదు. ఐపీఎల్ మూడు సీజన్లూ బాగానే బౌలింగ్ చేశాడు. ఇదే సమయంలో రంజీల్లో పెద్దగా ఆడలేదు. 3 మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. నిజానికి ఐపీఎల్‌లో బౌలింగ్ బాగా చేస్తే వన్డే జట్టులోకి లేదంటే టి20 జట్టులోకి రావాలి. కానీ టెస్టు జట్టులోకి వచ్చాడు.

ఐపీఎల్ ప్రదర్శనే కారణమనుకుంటే 2013లో 24 వికెట్లు తీశాడు. గత ఏడాది 14, ఈసారి ఇప్పటికి 16 వికెట్లు తీశాడు. అంటే ఈ ప్రదర్శన ఆధారంగా జట్టులోకి వచ్చేదుంటే 2013లో జట్టులో స్థానం పోకూడదు. ఎందుకంటే ఆ సీజన్ రంజీల్లో భజ్జీ 5 మ్యాచ్‌ల్లో 22 వికెట్లతో రాణించాడు. ఈసారి ఐపీఎల్‌లో తనతో పోలిస్తే ఆశిష్ నెహ్రా ఇంకా బాగా బౌలింగ్ చేశాడు. కాబట్టి ఐపీఎల్ ప్రదర్శన భజ్జీ పునరాగమనానికి కారణం కాదు.

జట్టు ఎంపిక తర్వాత సందీప్ పాటిల్ ఓ కీలక వ్యాఖ్య చేశారు. ‘ప్రత్యర్థి బలం ప్రకారం జట్టులో ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు అవసరం. యువ స్పిన్నర్ల పేరు చర్చకు వచ్చినా కెప్టెన్ కోహ్లి అభిప్రాయాన్నీ పరిగణనలోకి తీసుకున్నాం’ అని చెప్పారు. అంటే హర్భజన్‌ను కోహ్లి సిఫారసు చేశాడని అర్థమవుతోంది.

మరోవైపు భజ్జీ కూడా తన శ్రేయోభిలాషుల ఆశీస్సులు తనతో ఉన్నాయని చెప్పాడు. అంటే కోహ్లి తనకు మద్దతు ఇచ్చాడనే విషయం భజ్జీకి కూడా అర్థమైపోయిందనుకోవాలి.

కెప్టెన్‌గా ధోని ఎప్పుడూ ‘యువ’మంత్రమే జపిస్తాడు. అతను సారథిగా ఉన్నంతకాలం పాత క్రికెటర్లు మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశమే లేదనే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో ధోని అనూహ్యంగా టెస్టులకు గుడ్‌బై చెప్పడం, కోహ్లి పగ్గాలు రావడంతో భారత క్రికెట్‌లో ‘మార్పు’ మొదలైంది.

మిగిలిన వారి సంగతెలా ఉన్నా యువరాజ్, హర్భజన్‌ల విషయంలో కోహ్లికి చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది. మైదానంలో, వెలుపలా వీళ్లు ఎక్కడ కలిసినా సరదాగానే ఉంటారు. ఇప్పుడు టెస్టు జట్టు ఎంపికలో కెప్టెన్ నిర్ణయం కూడా కీలకం. సారథిగా కోహ్లి తనకు కావలసిన క్రికెటర్లను కోరుకునే అవకాశం ఉంది. సాధారణంగా సెలక్టర్లు రెండు పేర్లను ఖరారు చేస్తే అందులో కెప్టెన్ కోరుకున్న ఆటగాడే మిగులుతాడు. కాబట్టి భజ్జీ ఎంపికలో కోహ్లి పాత్ర చాలా కీలకం.

బంగ్లాదేశ్‌తో ఆడబోయేది కేవలం ఒక్క టెస్టు మాత్రమే. ఇందులో తుది జట్టులో హర్భజన్ ఉండటం దాదాపుగా ఖాయమే. కాబట్టి ఈ మ్యాచ్‌ను ఈ పంజాబీ క్రికెటర్ జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఆ మ్యాచ్‌లో గనక రాణిస్తే... మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంటుంది. వన్డే జట్టులోకి తిరిగి రావాలన్నా ఈ టెస్టులో అమోఘంగా రాణించాలి.

భజ్జీ ఎంపిక యువీ, సెహ్వాగ్, గంభీర్‌లాంటి క్రికెటర్లలో కూడా స్ఫూర్తిని పెంచే అంశం. నిజానికి ఈ ముగ్గురూ ఈ సీజన్ ఐపీఎల్‌లో విఫలమయ్యారు. ఒకవేళ యువీ ఈ సీజన్‌లో గనక బాగా ఆడివుంటే కచ్చితంగా సెలక్షన్ కమిటీ సమావేశంలో చర్చ జరిగేది. చర్చ జరిగే పరిస్థితే వస్తే కోహ్లి ఉంటాడు. మొత్తానికి భారత క్రికెట్‌లో జరిగిన ‘మార్పు’ వెటరన్ క్రికెటర్లలో కూడా ఆశను పెంచేదే.
                                         -సాక్షి క్రీడావిభాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement