Jaydev Unadkat: 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అనూహ్య పరిణామాల నడుమ భారత టెస్ట్ జట్టులో (బంగ్లాతో టెస్ట్ సిరీస్) చోటు దక్కించుకున్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్‌ను విధి దారుణంగా వెక్కిరించింది. సెలెక్టర్లు కరుణించి టీమిండియాకు ఆడే అవకాశం కల్పించినా, ఈ సౌరాష్ట్ర బౌలర్‌తో అదృష్టం బంతాట ఆడుకుంది. ఉనద్కత్ ఎంపిక ఊహించని పరిణామాల మధ్య ఆలస్యంగా చోటు చేసుకోవడంతో వీసా సమస్యలు తలెత్తి బంగ్లాతో తొలి టెస్ట్ సమయానికి అతను భారత జట్టుతో కలవలేని పరిస్థితి ఏర్పడింది.
బంగ్లాదేశ్‌తో రేపటి (డిసెంబర్ 14) నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానుండగా, వీసా పేపర్లు అందని కారణంగా ఉనద్కత్ భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో 12 ఏళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడాలనుకున్న అతని కలలు కలలుగానే మిగిలిపోయాయి. బీసీసీఐ లాజిస్టిక్ విభాగం అతన్ని వీలైనంత త‍్వరగా బంగ్లాదేశ్‌కు పంపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది. కనీసం రెండో టెస్ట్ సమయానికైనా ఉనద్కత్‌ను జట్టుతో కలిపేందుకు లాజిస్టిక్ విభాగం శతవిధాల ప్రయత్నిస్తుంది.
కాగా, 2010 డిసెంబర్‌లో చివరిసారిగా భారత టెస్ట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 31 ఏళ్ల ఉనద్కత్.. తనకు లభించిన ఏకైక అవకాశాన్ని సద్వినియోం చేసుకోలేక జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఉనద్కత్ పట్టువదలని విక్రమార్కుడిలా దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటి సెలెక్టర్లు తనను ఎంపిక చేసేలా చేసుకున్నాడు. అయితే చేతికందిన అదృష్టం వీసా సమస్యల కారణంగా చేజారడంతో అతను వాపోతున్నాడు. బంగ్లా పర్యటనకు ముందు షమీ గాయపడటంతో అతనికి రీప్లేస్‌మెంట్‌గా ఉనద్కత్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.
విజయ్ హజారే ట్రోఫీ-2022లో అతని అత్యద్భుతమైన ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ టీమిండియాలో స్థానం కల్పించింది. ఉనద్కత్.. టీమిండియా తరఫున ఒక టెస్ట్ మ్యాచ్, 7 వన్డేలు, 10 టీ20 ఆడి 22 వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ టోర్నీల్లో ఈ సౌరాష్ట్ర బౌలర్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఉనద్కత్ ఐపీఎల్‌లో సైతం మెరుగ్గా రాణించాడు. వివిధ ఫ్రాంచైజీల తరఫున 91 మ్యాచ్‌ల్లో 91 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతను ముంబై ఇండియన్స్‌లో కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment