ధోని కథ వేరు.. మాది వేరు!
ఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కకపోవడంపై వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు టీమిండియా జట్టులో స్థానం దక్కుతుందని తొలుత ఆశించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్న భజ్జీ...టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి స్థానం కల్పించడాన్ని పరోక్షంగా తప్పుబట్టాడు. చాంపియన్స్ ట్రోఫీలో ధోనికి స్థానం కల్పించి తనకు ఎందుకు చోటు కల్పించలేదో అర్ధం కాలేదన్నాడు. దాదాపు ఎప్పుడ్నుంచో క్రికెట్ ఆడుతున్న తనకు కనీసం ధోనికి ఇచ్చిన ప్రాధాన్యతను ఇచ్చి ఉంటే సంతోషించే వాడినని ఎట్టకేలకు మనసులోని బాధను వెల్లడించాడు. ఇక్కడ ధోని కథ వేరు.. తన కథ వేరుగా అభివర్ణించిన భజ్జీ.. చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు సెలక్షన్ నిజాయితీగా జరిగిందని తాను అనుకోవడం లేదన్నాడు.
' ధోని బ్యాటింగ్ లో కీలకం. అందులో ఎటువంటి సందేహం లేదు. ధోని ఫామ్లో ఉన్నా, లేకపోయినా జట్టులో ఎంపిక చేయడానికి కారణం అతని అనుభవం. గత కొంతకాలంగా ధోని పెద్దగా బంతిని హిట్ చేయడం లేదు. అది మనం చూస్తునే ఉన్నాం. అయితే అతను మాజీ సారథి కావడంతో పాటు పరిస్థితుల్ని అర్ధం చేసుకుని జట్టును ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉన్నవాడు. ప్రధానంగా మిడిల్ ఆర్డర్ లో యువ క్రికెటర్లకు ధోని అనుభవం ఉపయోగపడుతుంది. ఇక నా వరకూ వస్తే ధోనికిచ్చిన ప్రాముఖ్యత నాకివ్వలేనందుకు బాధగా ఉంది. మేము కూడా 19 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాం. టీమిండియా గెలుపుల్లో, ఓటముల్లో భాగస్వామ్యులమవుతునే వస్తున్నాం'అని గౌతం గంభీర్ ను ఎంపిక చేయకపోవడాన్ని కూడా హర్భజన్ సింగ్ ఇక్కడ ప్రస్తావించాడు. 'నేను రెండు వరల్డ్ కప్ లకు ప్రాతినిథ్యం వహించా. అవేవి పట్టించుకోలేదు. కొంతమందికి మాత్రమే ఈ తరహా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇలా ప్రాముఖ్యత దక్కని ఆటగాళ్లలో నేను కూడా ఒకడ్ని'అని భజ్జీ తన స్వరాన్ని పెంచుతూ సెలక్షన్ కమిటీ తీరును తప్పుబట్టాడు. కచ్చితంగా సెలక్షన్ అనేది నిజాయితీగా జరగలేదని తాను అనుకుంటున్నట్లు భజ్జీ తెలిపారు.
ఇప్పటికీ తాము ఐపీఎల్ వంటి టోర్నీలు ఆడటానికి కారణం టీమిండియా జట్టులో చోటును ఆశించి మాత్రమేనని పేర్కొన్నాడు. ఐపీఎల్లో గౌతం గంభీర్ నిలకడగా రాణించినా అతన్ని ఎందుకు పక్కన పెటారని భజ్జీ నిలదీశాడు.. మరొకవైపు ఐపీఎల్ -10 సీజన్ లో అస్సలు పాల్గొనని రవి చంద్రన్ అశ్విన్ ను చాంపియన్స్ ట్రోఫీలో ఎంపిక చేయడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. వేర్వేరు ప్రజలకు వేర్వేరు నిబంధనలు ఏమిటో తనకు అర్థం కావడం లేదని తన అసహనాన్ని వ్యక్తం చేశాడు హర్భజన్.