ఆత్మరక్షణలో పడ్డ హర్భజన్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనిని చాంపియన్స్ ట్రోఫికి ఎంపిక చేయడంపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ ప్రస్తుతం ఆత్మరక్షణలో పడ్డాడు. తాను ధోనికి వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదంటూ సర్దుకుని యత్నం చేశాడు.' నేను 19 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నా. వరల్డ్ కప్లో భాగస్యామ్యమయ్యా. కాకపోతే కొంతమందికి మాత్రమే ప్రత్యేక స్థానం ఇస్తున్నారు. నాకు ఎందుకు ఇవ్వడం లేదు. ధోనిని చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయడంలో అతని ప్రత్యేక కేటాయింపు ఇచ్చారు. మరి నా విషయంలో ఎందుకు అలా జరగలేదు'అని భజ్జీ విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే హర్భజన్ సింగ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగడంతో తన తప్పును సరిచేసుకునే పనిలో పడ్డాడు హర్భజన్ సింగ్.
'దయచేసి మీడియా సమన్వయం పాటించాలి. నేను ధోనికి వ్యతిరేకంగా కామెంట్ చేయలేదు. అతనికి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ధోని ఎంపికను నేను తప్పుపట్టలేదు. నేను మాట్లాడింది ఏమిటో మొత్తం వీడియో చూడండి. నాకు ధోని మంచి మిత్రుడు. దాంతో పాటు అతనొక అత్యుత్తమ ఆటగాడు'అని హర్భజన్ తెలిపాడు.