అప్‌డేటెడ్... రీమోడల్ సింధు | Hard labor behind the success of the sindhu | Sakshi
Sakshi News home page

అప్‌డేటెడ్... రీమోడల్ సింధు

Published Fri, Aug 19 2016 1:50 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

అప్‌డేటెడ్... రీమోడల్ సింధు

అప్‌డేటెడ్... రీమోడల్ సింధు

ఆ స్మాషింగ్‌లు అద్భుతం, ఆ దూకుడుకు అడ్డు కనిపించడం లేదు, ఎక్కడో ఎడమ వైపు మూలనుంచి ప్రత్యర్థి కోర్టులో కుడి వైపు

సింధు విజయాల వెనుక కఠోర శ్రమ

ఆ స్మాషింగ్‌లు అద్భుతం, ఆ దూకుడుకు అడ్డు కనిపించడం లేదు, ఎక్కడో ఎడమ వైపు మూలనుంచి ప్రత్యర్థి కోర్టులో కుడి వైపు మూలకు కొడుతున్న బ్యాక్ హ్యండ్ ఫ్లిప్ అసాధారణం...ఆడుతోంది సింధుయేనా అనిపిస్తోంది. అవును... ఇప్పుడు ఆమె పాత సింధు కాదు, పూర్తిగా అప్‌డేటెడ్ రీ మోడల్ సింధు! ఒలింపిక్స్‌లో ఆమె ఫిట్‌నెస్ చూస్తే చైనా గోడను పడకొట్టేందుకు ఆమె ఎన్ని రకాలుగా సన్నద్ధమై వచ్చిందో తెలుస్తుంది. రియోకు సన్నద్ధమయ్యేందుకు సింధు రెండున్నర నెలల పాటు కఠోర సాధన చేసింది. ఒక వైపు కోచ్ పుల్లెల గోపీచంద్ సూచనలు, వ్యూహాలు, సాంకేతికాంశాలు... మరో వైపు వాటిని సమర్థంగా ఆచరణలో పెట్టాల్సిన చేయాల్సిన శ్రమ... ఇవన్నీ ఒక సైన్స్ క్లాస్‌ను తలపించాయి. 2015 ఆరంభంలో గాయంతో సింధు ఆటకు దూరమైంది. ఆగస్టులో మళ్లీ బరిలోకి దిగిన ఆమె... తొమ్మిది నెలల వ్యవధిలో ఎడాపెడా టోర్నమెంట్‌లు ఆడేసింది. చిన్నా, పెద్దా కలిపి ఆమె వరుసగా 22 టోర్నీల్లో బరిలోకి దిగడం విశేషం! ఈ మధ్య కాలంలో రెండు గ్రాండ్‌ప్రి టైటిల్స్ నెగ్గగా, ఒక సూపర్ సిరీస్‌లో ఫైనల్‌కు చేరింది. కానీ ఎక్కడో ఆమె ఆటలో తేడా కనిపించింది. సింధు మారాల్సిన, ఆటనూ మార్చాల్సిన అవసరాన్ని గోపీ గుర్తించారు. గతంలో పెద్ద మ్యాచ్‌లలో గెలుపు అవకాశం ఉన్నా... శారీరక దారుఢ్యం విషయంలో కొంత వెనుకబడి మ్యాచ్‌లను కోల్పోయిన విషయంపై కూడా గోపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.  అంతే... పూర్తిగా కొత్త ప్రోగ్రాం రెడీ అయిపోయింది.

శిక్షణ సాగినన్ని రోజులు వీరిద్దరు సూర్యోదయంతో పోటీ పడ్డారు. ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే కోచింగ్ మధ్యలో రెండు స్వల్ప విరామాలు తప్ప మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సాగేది. మళ్లీ సాయంత్రం మరో నాలుగు గంటల శిక్షణ. ముఖ్యంగా సింధు ఆటలోనే కాదు ఫిట్‌నెస్‌లో వచ్చిన తేడా కూడా ఒలింపిక్స్‌లో స్పష్టంగా తెలిసిపోతోంది. ట్రైనర్ ప్రత్యేక పర్యవేక్షణలో కసరత్తులు, వెయిట్ ఎక్స్‌ర్‌సైజ్‌లు... ఇలా గతంలో ఎప్పుడూ పట్టించుకోని విషయాలపై కూడా సింధు ఫోకస్ చేసింది. టైమ్‌టేబుల్‌ను, ప్రోగ్రాం చార్ట్‌ను కచ్చితంగా అనుసరించింది. ఈ 75 రోజుల్లో ఆమె ఒక్కటంటే ఒక్క ప్రాక్టీస్ సెషన్ కూడా మిస్ కాలేదంటే ఆమె అంకితభావాన్ని, లక్ష్యసాధనపై ఉన్న పట్టుదలను అర్థం చేసుకోవచ్చు. తదేక దీక్షతో ఆమె ఆటను తీర్చిదిద్దే పనిలో గోపీచంద్, గురువు మనసెరిగిన శిష్యురాలిగా సింధు ఎక్కడా ఉదాసీనతకు తావు ఇవ్వలేదు. అవును మరి... తాము చరిత్ర సృష్టించబోతున్నామని వారికి ముందే తెలిసిపోయినట్లుంది!

 

ఆడుతున్న తొలి ఒలింపిక్స్‌లోనే రజతం లేదా స్వర్ణం గెలవనున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా సింధు నిలువనుంది. 2000 సిడ్నీలో కరణం మల్లీశ్వరి, 2012 లండన్‌లో మేరీకోమ్ కాంస్యాలు గెలిచారు.

స్వర్ణం సాధించేందుకు నా సర్వశక్తులూ ఒడ్డుతా. ఇక నా లక్ష్యం అదే. నేను పడ్ద కష్టానికి లభించిన ఫలితాలివి. ఫైనల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా నా వందశాతం అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తా. ఫైనల్‌కు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాను. మారిన్ కఠినమైన ప్రత్యర్థి. ఆమె కూడా చాలా బాగా ఆడుతోంది. కోచ్ గోపీచంద్ రూపొందించిన వ్యూహాలను అమలు చేసి మంచి ఫలితాన్ని సాధిస్తా.’  - సింధు

 

 సింధు, సాక్షిలపై ప్రశంసల వర్షం
ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించిన సాక్షి, సింధులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది...

రెజ్లింగ్‌లో పతకం తెచ్చిన సాక్షికి అభినందనలు, ఫైనల్లో సింధుకు బెస్ట్ ఆఫ్ లక్’ - రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
సింధు దేశం గర్వించేలా ఆడావు. స్వర్ణం సాధించాలని కోరుకుంటున్నా. సాక్షి కొత్త చరిత్ర సృష్టించింది. రక్షా బంధన్ రోజు ఈ ఘనతలతో గర్వపడుతున్నా’ - ప్రధాని మోదీ
సింధుకు అభినందనలు. ఇదే జోరు కొనసాగించాలి’    - తెలంగాణ సీఎం కేసీఆర్
అద్భుత ప్రతిభ కనబరిచిన సింధు స్వర్ణం సాధించాలి. సాక్షి మాలిక్ పోరాట స్ఫూర్తికి జేజేలు’  - వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి
ఉదయం లేవగానే శుభవార్త విన్నాను. సాక్షికి శుభాకాంక్షలు. సింధు ఓ అద్భుతం   - సచిన్
ఆడపిల్ల పుట్టగానే చంపకుండా ఉంటే ఎంత ఎత్తుకు ఎదగగలదో సాక్షి సాధించి చూపింది. సింధు అందరి హృదయాలు గెలిచింది’  -సెహ్వాగ్
భారతీయులు తలెత్తుకునేలా చేసిన సాక్షికి వందనాలు. మహిళల శక్తిని ఎవరూ తక్కువ అంచనా వేయకూడదు. సింధుతో నేను సెల్ఫీ దిగాలి. - అమితాబ్
ప్రతీ భారతీయుడి స్ఫూర్తిని తలకెత్తుకున్నందుకు సాక్షికి కృతజ్ఞతలు. స్వర్ణ పతక క్లబ్‌లో నేనిప్పటిదాకా ఒంటరిగా ఉన్నాను. సింధు.. నీకోసం వేచి చూస్తున్నాను. - అభినవ్ బింద్రా
ఇంతకుముందు ఏ భారత అమ్మాయి సాధించని ఘనత దక్కించుకున్న సాక్షి నిజమైన హీరో.  - సుశీల్ కుమార్


ఇదంతా గోపీ పుణ్యమే
ఒలింపిక్స్‌లో సింధు పతకం సాధించడాకి కోచ్ గోపీచంద్ కారణమని, ఆయన మార్గదర్శకత్వంలోనే ఎదిగిందని సింధు తల్లిదండ్రులు రమణ, విజయలక్ష్మి పేర్కొన్నారు. 

‘సింధు ప్రదర్శన అద్భుతంగా ఉంది. అంచనాలకు మించి రాణించి పతకం ఖాయం చేసుకుంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. తన మ్యాచ్ కోసం దేశం అంతా ఎదురుచూసింది. రోజు రోజుకూ ఆట మెరుగుపడుతోంది. ఫైనల్లో గెలుస్తుందని ఆశిస్తున్నాం’    - రమణ (సింధు తండ్రి)


‘మధ్యాహ్నమే ఫోన్లో మాట్లాడా. ఆహారం, విశ్రాంతి గురించి మాత్రమే అడిగా. మ్యాచ్ గురించి మాట్లాడితే టెన్షన్ పడుతుంది. సింధు స్వర్ణం సాధించాలని దేశం అంతా కోరుకుంటోంది. చిన్నప్పుడు మ్యాచ్ ఓడిపోతే ఏడ్చేది. ఇప్పుడు కూడా ఓడపోతే దిగాలుగా ఉంటుంది. సింధు కెరీర్‌లో ఏ ఘనత సాధించినా అది గోపీచంద్ పుణ్యమే’  - విజయలక్ష్మి (సింధు తల్లి)

సింధు స్వర్ణం సాధించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. మా తల్లిదండ్రులు, కోచ్ గోపీచంద్ ప్రోత్సాహంతోనే ఇక్కడి వరకు ఎదిగింది. - దివ్య (సింధు అక్క)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement