
ఆమ్లా డబుల్ సెంచరీ
అరంగేట్రంలో వాన్ జిల్ సెంచరీ
దక్షిణాఫ్రికా 552/5 డిక్లేర్డ్
విండీస్‌తో తొలి టెస్టు
సెంచూరియన్: దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా (371 బంతుల్లో 208; 22 ఫోర్లు) కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీ సాధించాడు. అలాగే తన తొలి టెస్టులోనే స్టియాన్ వాన్ జిల్ (130 బంతుల్లో 101 నాటౌట్; 15 ఫోర్లు) అదరగొట్టే ఆటతీరుతో సెంచరీ సాధించాడు. దీంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సఫారీ జట్టు రెండో రోజు గురువారం 140.3 ఓవర్లలో ఐదు వికెట్లకు 552 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
టీ విరామానికి అరగంట ముందు తమ ఇన్నింగ్స్‌ను ముగించినా... వర్షం కారణంగా విండీస్ బ్యాటింగ్‌కు దిగలేకపోయింది. అంతకుముందు 340/3 ఓవర్‌నైట్ స్కోరుతో తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సఫారీ తొలి సెషన్‌లోనే డివిలియర్స్ (235 బంతుల్లో 152; 16 ఫోర్లు; 2 సిక్సర్లు) వికెట్‌ను కోల్పోయింది.
ఆ తర్వాత ఆమ్లాకు 27 ఏళ్ల వాన్ జిల్ నుంచి చక్కటి సహకారం లభించింది. ఈ జోడి విండీస్ పసలేని బౌలింగ్‌ను ఓ ఆటాడుకుంది. 180 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న ఆమ్లా 359 బంతుల్లో ద్విశతకం సాధించాడు. స్వదేశంలో తనకిది తొలి డబుల్. అటు వాన్ జిల్ కూడా మెరుగ్గా రాణించి 129 బంతుల్లోనే తొలి సెంచరీ సాధించాడు. అరంగేట్ర టెస్టులో శతకం సాధించిన ఐదో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 155 పరుగులు జోడించారు. రోచ్, బెన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.