అండర్-19 క్రికెటర్ శివసింగ్ తల్లి (ఇన్ సెట్లో శివసింగ్)
సాక్షి, లక్నో: పృథ్వీ షా నేతృత్వంలోని యువ భారత క్రికెట్ జట్టు అండర్-19 ప్రపంచ కప్‌ను సొంతం చేసుకోగా.. కుటుంసభ్యులు క్రికెటర్లతో తమ సంతోషాన్ని షేర్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా సభ్యుడైన ఎడమచేతి వాటం స్పిన్నర్ శివసింగ్ తల్లి ప్రపంచ కప్ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. నా కుమారుడు శివ సింగ్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను. మేజర్ టోర్నీకి వెళ్లేముందు.. అండర్-19 ప్రపంచ కప్‌తోనే తిరిగొస్తామని శివసింగ్ అన్నాడు. చెప్పిన ప్రకారంగానే ప్రపంచ కప్ సాధించి భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన జట్టులో సభ్యుడయ్యాడు.
శివ సింగ్ కఠోర శ్రమతో ఈ స్థాయికి వచ్చాడు. భారత జట్టులో చోటు దక్కించుకుని మంచి క్రికెటర్‌గా రాణించాలన్నదే కుమారుడి ధ్యేయమని శివసింగ్ తల్లి తెలిపారు. భారత్ గర్వించేలా జట్టుకు తన సేవలు అందించాలని శివ సింగ్ తాపత్రాయ పడేవాడన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో స్పిన్నర్ శివసింగ్ సైతం రెండు వికెట్లు పడగొట్టి భారత విజయంలో పాలు పంచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో తొలుత ఇషాన్ పొరెల్ చెలరేగగా, ఆసీస్ మిడిల్, లోయర్ ఆర్డర్ క్రికెటర్లను శివ సింగ్, నగర్ కోటి, అనుకూల్ రాయ్‌లు వెంట వెంటనే ఔట్ చేసి భారత్‌కు స్వల్ప విజయలక్ష్యం ఉండేలా చేశారు. ఛేజింగ్‌లో మన్‌జోత్ కల్రా(101 నాటౌట్;102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీకి తోడు హర్విక్ దేశాయ్(47 నాటౌట్; 61 బంతుల్లో 5 ఫోర్లు) రాణించడంతో భారత్ కేవలం 2 వికెట్లు కోల్పోయి ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో నాలుగోసారి అండర్-19 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment