టి-20, వన్డేలకు లంక క్రికెటర్ గుడ్ బై
కొలంబో: శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగన హెరాత్ వన్డే, టి20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టులపై మరింత దృష్టిపెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని గతవారమే లంక బోర్డు (ఎస్‌ఎల్‌సీ) దృష్టికి తీసుకొచ్చానని, దానికి ఆమోదం కూడా తెలిపిందన్నాడు. ‘రాబోయే ఎనిమిది నెలల్లో మేం 12 టెస్టులు ఆడాల్సి ఉంది. కాబట్టి పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే 2019 ప్రపంచకప్ వరకు యువ ఆటగాళ్లు కుదురుకోవడానికి మంచి సమయం లభిస్తుంది. అలాగే నాపై భారం కూడా తగ్గించుకుని కేవలం టెస్టులపైనే దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నా’ అని హెరాత్ పేర్కొన్నాడు.
ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమైన హెరాత్... 2014 టి20 ప్రపంచకప్‌ను లంక గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. లంక తరఫున 71 వన్డేల్లో 74; 17 టి20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఏ క్రికెటరైనా ఏదో సమయంలో ఆటను ఆపేయాల్సిందేనని ఎస్‌ఎల్‌సీ వ్యాఖ్యానించింది. హెరాత్ టెస్టు క్రికెట్ భవిష్యత్ బాగుండాలని ఆకాక్షించింది. మే, జూన్ నెలల్లో లంక... ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇందుకోసం నేటి నుంచి సన్నాహాలు మొదలుపెట్టనుంది.