పొగాకును ప్రచారం చేస్తారా!
బీసీసీఐకి హైకోర్టు నోటీసు
ముంబై: ఐపీఎల్ జట్టు గుజరాత్ లయన్స్ తమ జెర్సీలపై పొగాకు ఉత్పత్తులకు ప్రచారం కల్పించడాన్ని అలహాబాద్ హైకోర్టు తప్పు పట్టింది. దీనికి ఎలా అనుమతించారంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి నోటీసు జారీ చేసింది. గుజరాత్ లయన్స్ జట్టుకు ‘శుధ్ ప్లస్’ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. ఆ జట్టు జెర్సీలపై ‘శుధ్ ప్లస్’ ప్రముఖంగా కనిపించేలా ముద్రించారు. అయితే ఇది పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులకు చెందిన సంస్థ. పొగాకు ఉత్పత్తుల ప్రచారంపై నిషేధం ఉంది. దీన్ని విస్మరించి కొన్ని కోట్ల మంది వీక్షించే లీగ్‌లో ప్రచారం చేయడంపై కాన్పూర్‌కు చెందిన ప్రకాశ్ కర్వాడ్కర్ అలహాబాద్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ డి.బి. బోసలే, జస్టిస్ యశ్వంత్ వర్మలతో కూడిన ద్విసభ్య బెంచ్ వివరణ ఇవ్వాలని బీసీసీఐ, బ్రాడ్‌క్యాస్టర్ సోని పిక్చర్స్ నెట్‌వర్క్‌లకు నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 5 సీఓటీపీఏ చట్టం–2003 ప్రకారం పొగాకు ఉత్పత్తుల ప్రచారంపై నిషేధం అమలులో ఉంది. అయితే గుజరాత్ లయన్స్ మాత్రం ‘పొగాకు క్యాన్సర్ కారకం, ఆరోగ్యానికి హానికరం’ అనే కనీస హెచ్చరికలు లేకుండానే శుధ్ ప్లస్‌కు ప్రచారం కల్పిస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు. విచారణకు స్వీకరించిన ద్విసభ్య బెంచ్ బోర్డు, బ్రాడ్‌క్యాస్టర్‌ల వివరణ కోరుతూ కేసును వాయిదా వేసింది. ఈ సీజన్‌లో ఇప్పటికే 13 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్, తమ ఆఖరి పోరులో నేడు సన్‌రైజర్స్‌తో తలపడనుంది.