ప్రతీకాత్మక చిత్రం
గాంధీనగర్ : భార్యతో భర్త చేసే శృంగారాన్ని రేప్(అత్యాచారం)గా పరిగణించలేమని, మారిటల్ రేప్ నేరం కాదని గుజరాత్ హైకోర్టు అభిప్రాయపడింది. అసహజ పద్ధతుల్లో శృంగారం, ఓరల్ సెక్స్‌ను మాత్రం క్రూరత్వానికి సమానమని పేర్కొంది. ఓ మహిళా డాక్టర్, ఆమె భర్తపై చేసిన ఫిర్యాదు విచారణకు వచ్చిన సమయంలో ఈ విధంగా కోర్టు వ్యాఖ్యానించింది. తన భర్త బలవంతంగా, తన ఇష్టానికి వ్యతిరేకంగా లైంగికంగా వేధిస్తున్నాడని.. కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె ఫిర్యాదు చేయడంతో పాటు కేసు పెట్టింది. దీంతో భర్త గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు.
భార్య అనుమతి లేకుండా ఆమెతో భర్త శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని రేప్‌గా పరిగణించలేమని జస్టిస్ జేబీ పార్డివాలా వ్యాఖ్యానించారు. అలాగే భార్య వయసు 18 సంవత్సరాల కంటే తక్కువగా లేనందున భారత శిక్షా స్మృతిలోని 375 కింద రేప్‌గా పరిగణించడం కుదరదని న్యాయమూర్తి పేర్కొన్నారు. కానీ ఐపీసీ 377 కింద అసహజ పద్ధతుల్లో శృంగారం చేస్తున్న విషయం మీద కేసు వాదనలు సాగించవచ్చునని ఆమెకు సూచించారు.
సక్రమంగా పెళ్లి చేసుకున్న భార్యతో శృంగారం జరిపే హక్కు భర్తకు ఉన్నదని పేర్కొంటూనే.. భార్య, భర్త ఆస్తి కాదని, ఆమె ఇష్టం లేకుండా శృంగారం జరపకూడదని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉటంకించారు. వరకట్నం, లైంగిక వేధింపులను తీవ్రంగా పరగణిస్తామని స్పష్టం చేశారు. ఈ కేసు సీబీఐ లేదా సీఐడీ లాంటి పెద్ద దర్యాప్తు సంస్థలకు అప్పగించేందుకు న్యాయమూర్తి అంగీకరించలేదు. మహిళా డాక్టర్ చేసిన ఫిర్యాదుపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment