అదే సందిగ్ధత | Himachal government Thakur of negotiations fail | Sakshi
Sakshi News home page

అదే సందిగ్ధత

Published Thu, Mar 3 2016 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM

అదే సందిగ్ధత

అదే సందిగ్ధత

 హిమాచల్ ప్రభుత్వంతో ఠాకూర్ చర్చలు విఫలం
 
 సిమ్లా: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఈ నెల 19న ధర్మశాలలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ మ్యాచ్‌పై సందిగ్ధత వీడలేదు. ఈ మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో... బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఆయనతో సమావేశమై చర్చలు జరిపినా స్పష్టత రాలేదు. ‘రాష్ట్రంలో నివసిస్తున్న సైనికుల కుటుంబాలకు మేం గౌరవం ఇవ్వాలి. వాళ్లు మ్యాచ్ సందర్భంగా ఆందోళన చేస్తే మేం కఠిన చర్యలు తీసుకోలేం. సైనికుల కుటుంబాలపై, మాజీ సైనికులపై లాఠీ చార్జ్ చేయలేం. అంతగా మ్యాచ్ ధర్మశాలలోనే నిర్వహించాలని భావిస్తే వెళ్లి ఆ కుటుంబాలతో చర్చలు జరుపుకోండి’ అని వీరభద్ర సింగ్ చర్చల సందర్భంగా అనురాగ్ ఠాకూర్‌కు స్పష్టం చేశారు. అటు మాజీ సైనికులు కొందరు బుధవారం ధర్మశాలలో సమావేశమై మ్యాచ్ నిర్వహించవద్దని మరోసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

 ఠాకూర్‌కు షాక్
 అయితే తన సొంత రాష్ట్రంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను ఎలాగైనా నిర్వహించాలని పట్టుదలతో ఉన్న అనురాగ్ ఠాకూర్‌కు షాక్ ఎదురైంది. బీజేపీ పార్టీకే చెందిన హిమాచల్ ప్రదేశ్ సీనియర్ నాయకుడు, ఎంపీ శాంత కుమార్ కూడా మ్యాచ్ నిర్వహించవద్దంటున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, సైనిక కుటుంబాల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని మ్యాచ్‌ను ధర్మశాలలో నిర్వహించవద్దని ప్రధానికి లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వం రాజకీయాలు చేసేందుకు మ్యాచ్‌ను అడ్డుకుంటోందని ఇన్ని రోజులూ ఆరోపిస్తున్న ఠాకూర్‌కు... ఇప్పుడు సొంత పార్టీ ఎంపీ లేఖ మింగుడుపడటం లేదు. మరోవైపు మొహాలీలో భారత్, వెస్టిండీస్‌ల మ్యాచ్‌ను ధర్మశాలకు మార్చి... భారత్, పాక్ మ్యాచ్‌ను మొహాలీకి మార్చాలనే ప్రతిపాదన కూడా తెర మీదకు వచ్చింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement