హోబర్ట్ (బెల్లెరివ్ ఓవల్)
టాస్మానియా రాజధాని అయిన హోబర్ట్‌ను 1804లో కనుగొన్నారు. ఎక్కువ మంది పర్యాటకులు... చరిత్రాత్మక శివారు ప్రాంతాలను తిలకించేందుకు ఇక్కడకు వస్తుంటారు. దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన రెస్టారెంట్లు, కెఫేలు, ఉత్సాహపూరితమైన సంగీతం, నైట్‌లైఫ్ కల్చర్‌కు ఇది చాలా ప్రసిద్ధి. బెల్లెరివ్ ఓవల్ మైదానం టాస్మానియా అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రధాన కేంద్రం. 1988 నుంచి ఇక్కడ క్రికెట్ ఊపందుకుంది. గతంలో ఫుట్‌బాల్ స్టేడియంగా కూడా వాడుకున్నారు.
హోబర్ట్ సిటీ సెంటర్ నుంచి 10 నిమిషాల ప్రయాణం. 1931లో నిర్మించిన ఈ స్టేడియాన్ని బెల్లెరివ్‌లో 2003 వరకు అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. సదరన్ స్టాండ్స్‌లో కొత్తగా 6 వేల సీట్లను అందుబాటులోకి తేవడంతో పాటు ఇండోర్ నెట్స్, ఇద్దరు సభ్యులకు బిల్డింగ్‌లను నిర్మించారు. ప్రస్తుతం దీని సామర్థ్యం 20 వేలు. ఈస్ట్రన్ బౌండరీ వైపు ఎత్తై గుట్ట ఉండటం ప్రత్యేక ఆకర్షణ. మైదానం మధ్యలో 10 వికెట్లను రూపొందించారు. దీనికి కొద్ది దూరంలో డార్వెంట్ నది ఉండటంతో మధ్యాహ్నం సమయంలో గాలులు వీస్తాయి.