cricket-world cup- 2015
-
వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా ఘనవిజయం
-
కాసేపట్లో విండీస్, సౌతాఫ్రికా మ్యాచ్
-
జింబాబ్వేపై విండీస్ విజయం
-
క్రికెటర్లను మీటింగ్ లతో విసిగించొద్దు!
కరాచీ:వన్డే వరల్డ్ కప్ లో పేలవమైన ఫామ్ తో వరుస రెండు ఓటములను మూట గట్టుకుని సర్వత్రా విమర్శలను అందుకుంటున్న పాకిస్థాన్ క్రికెటర్లకు ఆ జట్ట మాజీ కెప్టెన్, బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ బాసటగా నిలిచాడు. గెలుపు -ఓటమి అనేవి సహజంగా వస్తూ ఉంటాయని.. వాటి నుంచి ఆటగాళ్లు తేరుకోవడానికి కాస్త విశ్రాంతినివ్వమని జట్టు మేనేజ్ మెంట్ కు సూచించాడు. టీమ్ మేనేజ్ మెంట్ అనవసరంగా క్రికెటర్లతో మీటింగ్ లు పెట్టి విసిగించవద్దని అక్రమ్ తెలిపాడు.సుదీర్ఘమైన సమావేశాలు, చర్చలు, కఠిన శిక్షణలు అనేవి ఎప్పుడూ మంచిఫలితాలను ఇవ్వవన్నాడు. ఆ క్రికెటర్ల తదుపరి మ్యాచ్ కు ఫ్రెష్ మైండ్ సెట్ తో ఉండేందకు పాక్ క్రికెట్ పెద్దలు సహకరించాలని విజ్ఞప్తి చేశాడు. టీమిండియా, వెస్టిండీస్ లపై ఘోర పరాజయాన్ని చూసిన పాకిస్థాక్ క్రికెట్ టీమ్ పై ఇంటా బయటా విమర్శలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పాకిస్థాన్ క్రికెట్ పేలవ ఫామ్ పై లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీమిండియా, వెస్టిండీస్ జట్లపై ఓటమికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ షర్ యార్ అహ్మద్ ఖాన్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నజామ్ సేథీలే కారణమని.. వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని న్యాయవాది రిజ్వాన్ గుల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటు ఆ మ్యాచ్ ల్లో పాకిస్థాన్ ఓటమిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆ పిటిషన్ లో న్యాయవాది కోరడంతో క్రికెటర్లలో ఆందోళన మొదలైంది. -
జింబాబ్వేపై విండీస్ విజయం
విధ్వంసక ఇన్నింగ్స్ తో క్రిస్ గేల్ డబుల్ సెంచరీ.. శామ్యూల్స్ సెంచరీతో మోతెక్కించడంతో ప్రపంచకప్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన లీగ్ మ్యాచ్ లో వెస్టిండీస్ విసిరిన భారీ లక్ష్యాన్ని జింబాబ్వే ఛేదించలేకపోయింది. 44.3 ఓవర్లలో 289 పరుగులు చేసి ఆలౌటైంది. జింబాబ్వే ఆటగాళ్లలో విలియమ్స్ కాసేపు పోరాటం చేసినప్పటికీ ఫలితాన్ని మార్చలేకపోయాడు. 61 బంతుల్లో 9 ఫోర్లతో 76 పరుగుచేసిన విలియమ్స్ ఇన్నింగ్స్ 28వ ఓవర్లో అవుటయ్యాడు. ఇర్విన్ అర్థసెంచరీ(52) సాధించాడు. ఓపెనర్ రజా 26, టెయిలర్ 37, కెప్టెన్ చిగుంబుర 21 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, టెయిలర్ చెరో మూడు వికెట్లు తీయగా డబుల్ సెంచరీ వీరుడు క్రిస్ గేల్ బౌలింగ్ లోనూ మాయాజాలం చేశాడు. 6 ఓవర్లు వేసిన గేల్.. 35 పరుగులిచ్చి 2 వికెట్లు నేలకూల్చాడు. శామ్యూల్స్ కు ఒక వికెట్ దక్కింది. ఆద్యంతం అద్భుత ప్రదర్శననిచ్చిన క్రిస్ గేల్ నే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు రెండో ఓవర్లోనే ఓపెనర్ స్మిత్ వికెట్ ను కోల్పోయింది. జింబాబ్వే బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో క్రిస్ గేల్, శామ్యూల్స్.. వికెట్ ను కాపాడుకుంటూ నిలకడగా ఆడారు. ఇన్నింగ్స్ చివరి పది ఓవర్లలో చెలరేగిన గేల్, శామ్యూల్స్ జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించారు. వరుస సిక్స్ లు, ఫోర్ లతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. ఏదేని వికెట్ కు ప్రపంచ రికార్డు భాగస్వామ్యం (372 పరుగులు) నెలకొల్పారు. వన్ డేల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించడంతోపాటు, వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా గేల్ చరిత్ర సృష్టించాడు. ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు (16) సాధించి రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స సరసన నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి గేల్ అవుటవ్వడంతో 50 ఓవర్లలో విండీస్ 372 పరుగుల భారీస్కోరు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో వర్షం కారణంగా కాసేపు ఆట నిలిచిపోయింది. దీంతో డక్ వర్త లూయిస్ పద్ధతి ప్రకారం జింబాబ్వే 363 (48 ఓవర్లు)గా నిర్ణయించారు. అయితే, 289 పరుగులకే ఆలౌట్ కావడంతో 73 పరుగుల తేడాతో వెస్టిండీస్ గెలిచినట్లయింది. -
బంతితోనూ మెరిసిన గేల్!
విధ్వంసం అంటే ఎలా ఉంటుందో తన బ్యాట్‌తో ఇటు ప్రేక్షకులకు, ఇటు జింబాబ్వే ఆటగాళ్లకు రుచి చూపించిన విండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్.. ఇటు బంతితో కూడా మెరిశాడు. కీలక సమయంలో రెండు వికెట్లు తీసుకుని తన ఆల్‌రౌండ్ ప్రతిభను చూపించాడు. 41 బంతుల్లోనే 52 పరుగులు సాధించి, జింబాబ్వే స్కోరుబోర్డును చకచకా పరుగులు తీయిస్తున్న ఎర్విన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత కొద్ది సేపటికే మట్సికెన్యెరిని 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్బీడబ్ల్యుగా వెనక్కి పంపాడు. అంతకుముందు 177 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన జింబాబ్వే జట్టు నిలకడగా రాణిస్తూ 226 పరుగుల వరకు వికెట్ పడకుండా కాపాడుకుంది. అయితే.. ఉన్నట్టుండి గేల్ రంగంలోకి దిగడంతో తక్కువ పరుగుల తేడాతోనే రెండు వికెట్లు టపటపా రాలిపోయాయి. 226 పరుగుల వద్ద ఎర్విన్ ఆరో వికెట్గాను, ఆ తర్వాత మరో 13 పరుగులకే మట్సికెన్యెరి వెనుదిరిగారు. దాంతో ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందడానికి క్రిస్ గేల్‌కు ఎలాంటి అడ్డంకి లేనట్లు అయ్యింది. -
పరుగుల వేటలో తడబడుతున్న జింబాబ్వే
వెస్టిండీస్ విసిరిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే బ్యాట్స మన్ తడబాటుకు గురయ్యారు. 38 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే 254 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించిన క్రిస్ గేల్.. బౌలింగ్ లోనూ తన సత్తా చూపి 2 వికెట్లు తీశాడు. హోల్డర్ 3, టెయిలర్ 2, శామ్యూల్స్ కు ఒక వికెట్ తీశారు. దుస్సాధ్యమైన విజయం కోసం జింబాబ్వే 12 ఓవర్లలో 109 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 2 వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. -
క్రిస్ గేల్ పరుగుల సునామీ
-
21 ఓవర్లలో జింబాబ్వే స్కోరు 132/4
కష్టసాధ్యమైన లక్ష్యసాధన కోసం జింబాబ్వే చమటోడ్చుతూ తడబడుతోంది. 21 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 6.25 రన్ రేట్ తో 132 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ ఆఫ్ సెంచరీ చేశాడు. ఎర్విన్ రెండు పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు. ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన బ్రెండన్ టేలర్ ను 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శామ్యూల్స్ అవుట్ చేశాడు. డక్ వర్త లూయిస్ ప్రకారం జింబాబ్వే 48 ఓవర్లలో 363 పరుగులు సాధించాల్సి ఉంటుంది. -
10ఓవర్లలో జింబాబ్వే స్కోరు 54 /3
డక్ వర్త లూయీస్ ప్రకారం 48 ఓవర్లలో 363 పరుగుల లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో జింబాబ్వే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో విండీస్ సీమర్ల ధాటికి వికెట్లనూ కోల్పోతోంది. పది ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే 54 పరుగులు సాధించింది. -
'డక్‌వర్త్' ప్రకారం జంబాబ్వే లక్ష్యం 363
వర్షం అనంతరం జింబాబ్వే ఇన్నింగ్స్ తిరిగి ప్రారంభమైంది. అయితే డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం జింబాబ్వే విజయలక్ష్యాన్ని 363 పరుగులకు కుదించి, రెండు ఓవర్ల కోతను విధించారు. దీంతో జింబాబ్వే 48 ఓవర్లలోనే 363 పరుగుల లక్ష్యన్నిఛేదించాల్సి ఉంటుంది. మ్యాచ్ ఆరో ఓవర్లో జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. మసకద్జాను విండీస్ బౌలర్ టెయిలర్ ఎల్ బీ డబ్ల్యూగా పవిలియన్ కు పంపాడు. 6 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే 34 పరుగులు చేసింది. -
క్రిస్ గేల్ విధ్వంసకాండ ఎలా సాగిందంటే..
కాన్ బెర్రా: తుపాను, సునామీ, విధ్వంసం, విస్పోటనం.. ఇవన్నీ కలిస్తే ఎలా ఉంటుందో కాన్ బెర్రా మనుకా ఓవల్‌లో అలాంటి దృశ్యం ప్రత్యక్షమైంది. వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గేల్ సృష్టించిన పరుగుల సునామీలో జింబాబ్వే బౌలర్లు గల్లంతయ్యారు. సింగిల్స్ కంటే ఫోర్లు, సిక్సర్లు బాదడమే సులువన్నట్టుగా గేల్ రెచ్చిపోయాడు. జింబాబ్వే ఆటగాళ్లు నిస్సహాయులుగా మిగిలిపోగా.. ప్రేక్షకులు ఫీల్డర్లుగా మారిపోయారు. ప్రపంచ కప్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా ఈ జమైకా స్టార్ క్రికెటర్ చరిత్ర పుటలకెక్కాడు. అంతర్జాతీయ వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా, తొలి విండీస్ క్రికెటర్‌గా ఘనత సాధించాడు. 50 బంతుల్లో 50.. 105 బంతుల్లో 100.. 126 బంతుల్లో150.. 138 బంతుల్లో 200 ఇలా గేల్ విధ్వంసకాండ కొన సాగింది. ఓవర్ల వారీగా తొలి ఓవర్: పన్యగర బౌలింగ్ లో చివరి బంతికి రెండు పరుగులతో వేట మొదలెట్టాడు. నాలుగో ఓవర్: చటారా బౌలింగ్ తొలి ఫోర్ ఆరో ఓవర్:చటారా బౌలింగ్‌లోనే రెండు ఫోర్లతో అలరించాడు. 11వ ఓవర్: విలియమ్స్ వేసిన ఓవర్లో తొలి సిక్సర్ సంధించాడు. 15వ ఓవర్: విలియమ్స్ బౌలింగ్‌లో మరో ఫోర్ 18వ ఓవర్: చిగుంబుర బౌలింగ్‌లో సిక్సర్, సింగిల్‌తో హాఫ్ సెంచరీ 20వ ఓవర్: చిగుంబర బౌలింగ్‌లోనే ఫోర్ 26వ ఓవర్: కముంగోజి ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు 29వ ఓవర్: సికిందర్ రాజా బౌలింగ్‌లో మరో సిక్సర్ 36వ ఓవర్: మసకద్జ బౌలింగ్‌లో సింగిల్‌తో 22వ వన్డే సెంచరీ. ఇదే ఓవర్లో సిక్సర్ 38 వ ఓవర్: పన్యగర ఓవర్లో ఫోర్, సిక్సర్ 40వ ఓవర్: పన్యగర ఓవర్లోనే మరో సిక్సర్. ఇదే ఓవర్లో గేల్ క్యాచ్ అవుటయ్యాడు. అయితే అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. 41వ ఓవర్: మసకద్జ బౌలింగ్‌లో సిక్సర్ 42వ ఓవర్: చిగుంబుర ఓవర్లో సిక్సర్ 43వ ఓవర్: విలియమ్స్ బౌలింగ్‌లో 150 పరుగులు పూర్తి 44వ ఓవర్: కముంగొజి బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6, 4. ఇదే ఓవర్లో వన్డేల్లో గేల్ (157) అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు. 45వ ఓవర్: విలియమ్స్ ఓవర్లో వరుసగా 6, 6, 6. ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు (189) చేసిన ఆటగాడిగా రికార్డు. దక్షిణాఫ్రికా ఆటగాడు కిర్ స్టెన్ (యూఏఈపై 188) రికార్డు బ్రేక్. 46వ ఓవర్: చటారా బౌలింగ్‌లో 6, 4, 4. డబుల్ సెంచరీ నమోదు. ప్రపంచ కప్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 48వ ఓవర్: శామ్యూల్స్‌తో కలసి 332 పరుగుల భాగస్వామ్యం. వన్డేల్లో ప్రపంచ రికార్డు 50వ ఓవర్: ఆఖరి బంతికి గేల్ (215) నిష్ర్కమణ -
జింబాబ్వే లక్ష్యం 373
కాన్ బెర్రా: ప్రపంచకప్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన పూల్ బి మ్యాచ్ లో వెస్టిండీస్ రెండు వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది. విండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ ప్రపంచ కప్ రికార్డు నెలకొల్పాడు. టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ రెండో బంతికే విండీస్ ఓపెనర్ స్మిత్ ను అవుట్ చేసి.. తొలి ఇరవై ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన జింబాబ్వే.. మ్యాచ్ ముగిసే సరికి విండీస్ కు ఇన్ని పరుగులు సమర్పించుకుంటుందని ఊహించి ఉండరు. కానీ గేల్ సుడిగాలి ఇన్నింగ్స్ కు తోడు శామ్యూల్స్ బాధ్యతాయుత బ్యాటింగ్ భారీ స్కోరు నమోదు చేసింది. 147 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో 215 పరుగులు చేసిన గేల్.. మసకద్జా వేసిన చివరి ఓవర్ ఆఖరు బంతికి చిగుంబరకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 156 బంతులు ఎదుర్కొన్న మార్లన్ శ్యామ్యూల్స్ 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 133 పరుగులుచేసి నాట్ అవుట్ గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో పన్యగర, మసకద్జా చెరో వికెట్ తీశారు. -
గేల్ రికార్డుల మోత
కాన్ బెర్రా: జింబాబ్వేతో ప్రపంచ కప్ మ్యాచ్ లో విండీస్ రికార్డుల మోత మోగించింది. విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ రికార్డుల మీద రికార్డులు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ లో ప్రపంచ కప్ లో తొలి డబుల్ సెంచరీ, వన్డేల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం తదితర రికార్డులు నమోదయ్యాయి. ప్రపంచ కప్ లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ (215) చరిత్ర సృష్టించాడు. క్రిస్ గేల్ 138 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. ఇక వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయేతర క్రికెటర్ గా, తొలి విండీస్ ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. క్రిస్ గేల్, శ్యామ్యూల్స్ తో కలసి అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. ద్రావిడ్, సచిన్ ల పేరిట ఉన్న 331 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించారు. గేల్, శామ్యూల్స్ రెండో వికెట్ కు 372 పరుగులు జోడించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఏ వికెట్ కైనా ఇదే అత్యధికం. ఇక అంతర్జాతీయ టీ-20ల్లో సెంచరీ, వన్డేల్లో డబుల్ సెంచరీ, టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా గేల్ మరో రికార్డు నెలకొల్పాడు. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా గేల్ మరో రికార్డు బద్దలు కొట్టాడు. ఇక వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్ మన్ గానూ క్రిస్ గేల్ (16 సిక్సర్లు).. రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్ సరసన నిలిచాడు. ఇంతకుముందు ప్రపంచ కప్ లో అత్యధిక పరుగుల రికార్డు సౌతాఫ్రికా ఆటగాడు గ్యారీ కిర్ స్టన్ పేరిట ఉండేది. 1996 వరల్డ్ కప్ లో యూఏఈ జట్టుపై కిర్ స్టెన్ 188 పరుగులు చేశాడు. ఇప్పుడు గేల్ ఆ రికార్డును అధిగమించాడు. ఇక వన్డేల్లో రోహిత్, సచిన్, సెహ్వాగ్ డబుల్ సెంచరీలు బాదాగా, తాజాగా గేల్ వారి సరసన నిలిచాడు. -
జింబాబ్వేపై గేల్ 'డబుల్' విధ్వంసం!
-
గేల్ డబుల్ సెంచరీ.. ప్రపంచ కప్ రికార్డు
కాన్బెర్రా: వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ పరుగుల సునామీ సృష్టించాడు. ప్రపంచ కప్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా, వెస్టిండీస్ జట్టు తరపున వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా గేల్ రికార్డు సృష్టించాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో గేల్ 138 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. గేల్ 9 ఫోర్లు, 16 సిక్సర్లతో ఈ ఫీట్ నెలకొల్పాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన గేల్ సెంచరీ చేశాక.. ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో పెను విధ్వంసం సృష్టించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడిగా గేల్ ఘనత సాధించాడు. ఇంతకుముందు భారత ఆటగాళ్లు సెహ్వాగ్, సచిన్, రోహిత్ శర్మ డబుల్ సెంచరీలు బాదారు. ఈ ముగ్గురు భారత ఆటగాళ్లే కావడం విశేషం. -
గేల్ క్యాచ్ అవుట్.. కాదు నాటౌట్
కాన్బెర్రా: పాపం జింబాబ్వే ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. పన్యగర వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్లో వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ గేల్ క్యాచ్ అవుటయ్యాడు. దీంతో గేల్‌ను అవుట్ చేయడానికి నానా తంటాలు పడుతున్న జింబాబ్వే ఆటగాళ్లు సంబరపడిపోయారు. అయితే అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. అంతే జింబాబ్వే శిబిరంలో సంతోషం క్షణాల్లో మాయమైంది. గేల్ నాటౌట్ గా మిగిలిపోయాడు. గేల్ (123) భారీ సెంచరీ దిశగా సాగుతూ జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. -
క్రిస్ జి'గేల్'.. సెంచరీ
కాన్బెర్రా: వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ మెరిశాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో గేల్ (108) మెరుపు ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయి సెంచరీ చేశాడు. గేల్ 5 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగాడు. గేల్ సెంచరీకి తోడు శామ్యూల్స్ (59) హాఫ్ సెంచరీ చేశాడు. కాగా శామ్యూల్స్ నింపాదిగా ఆడాడు. ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ 37 ఓవర్లలో వికెట్ నష్టానికి 177 పరుగులు చేసింది. వెస్టిండీస్ పరుగుల ఖాతా తెరవకనే తొలి వికెట్ కోల్పోయింది. విండీస్ ఓపెనర్ డ్వెన్ స్మిత్.. ఇన్నింగ్స్ రెండో బంతికే బౌల్డయ్యాడు. అయితే గేల్, శామ్యూల్స్ క్రీజులో పాతుకుపోయి విండీస్‌ను ఆదుకున్నారు. శామ్యూల్స్ నింపాదిగా ఆడగా, గేల్ మొదట్నుంచి బ్యాట్ ఝళిపించాడు. -
గేల్ మెరుపు బ్యాటింగ్
కాన్బెర్రా: వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ రెచ్చిపోతున్నాడు. 51 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేసిన గేల్ (77) సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. కముంగోజి బౌలింగ్‌లో గేల్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. కాగా శామ్యూల్స్ (44) మరీ నింపాదిగా ఆడుతున్నాడు. ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్‌లో వెస్టిండీస్ 27 ఓవర్లలో వికెట్ నష్టానికి 128 పరుగులు చేసింది. -
గేల్ జిగేల్.. హాఫ్ సెంచరీ
కాన్బెర్రా: వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ మెరిశాడు. ప్రపంచ కప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన గేల్.. జింబాబ్వేపై హాఫ్ సెంచరీ చేశాడు. గేల్ 51 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం గేల్ (57)తో పాటు శామ్యూల్స్ (28) క్రీజులో ఉన్నాడు. ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్‌లో వెస్టిండీస్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. -
నిలకడగా ఆడుతున్న గేల్
కాన్బెర్రా: తొలి రెండు మ్యాచ్‌లలో నిరాశపరిచిన వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్.. జింబాబ్వేపై నిలకడగా ఆడుతున్నాడు. గేల్ మూడు ఫోర్లతో 24 పరుగులు చేశాడు. గేల్‌తో పాటు శామ్యూల్స్ (17) బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్‌లో వెస్టిండీస్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. వెస్టిండీస్ పరుగుల ఖాతా తెరవకనే తొలి వికెట్ కోల్పోయింది. విండీస్ ఓపెనర్ డ్వెన్ స్మిత్.. ఇన్నింగ్స్ రెండో బంతికే బౌల్డయ్యాడు. -
ఖాతా తెరవకనే తొలి వికెట్ కోల్పోయిన విండీస్
కాన్బెర్రా: వెస్టిండీస్ పరుగుల ఖాతా తెరవకనే తొలి వికెట్ కోల్పోయింది. విండీస్ ఓపెనర్ డ్వెన్ స్మిత్.. ఇన్నింగ్స్ రెండో బంతికే బౌల్డయ్యాడు. ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ మొదలైంది. ఈ ఈవెంట్లో విండీస్, జింబాబ్వే చెరో రెండు మ్యాచ్‌లాడగా ఒక్కో మ్యాచ్‌లో గెలిచాయి. -
బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్
కాన్బెర్రా: ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా వెస్టిండీస్, జింబాబ్వే జట్ల మధ్య కాసేపట్లో మ్యాచ్ ఆరంభంకానుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఈవెంట్లో విండీస్, జింబాబ్వే చెరో రెండు మ్యాచ్‌లాడగా ఒక్కో మ్యాచ్‌లో గెలిచాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన విండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఈ మ్యాచ్‌లోనైనా రాణించాలని విండీస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. -
గేల్ విజృంభించేనా?
కాన్బెర్రా (మనుకా ఓవల్): ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-బిలో మంగళవారం జరగబోయే మ్యాచ్ లో వెస్టిండిస్ జట్టు, జింబాంబ్వేతో తల పడనుంది. మొదటి మ్యాచ్ లో ఐర్లాండ్ పై ఓడి, రెండో మ్యాచ్ లో పాక్ పై భారీ ఆధిక్యంతో విజయాన్ని వెస్టిండిస్ తమ ఖాతాలో వేసుకుంది. అదే జోరును జింబాంబ్వేతో జరిగే మ్యాచ్ లో కొనసాగించాలని కరేబియన్లు కసిగా ఉన్నారు. జింబాంబ్వే జట్టు కూడా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో గెలిచి, వెస్టిండిస్ పై కూడా గెలవాలని ఉవ్విల్లూరుతోంది. విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ ఫామ్ లో లేక పోవడం వెస్టిండిస్ ని కలవర పరుస్తోంది. గత 20 నెలల్లో తన చివరి సెంచరీ చేసిన తర్వాత ఆడిన 19 ఇన్నింగ్స్‌ల్లో 14.42 సగటు స్కోరు మాత్రమే గేల్ నమోదు చేశాడు. పాక్‌తో ఆడిన కీలక మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లోనైనా గేల్ విజృంభించి ఫాంలోకి రావాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
వెల్లింగ్టన్ (వెస్ట్‌పాక్ స్టేడియం)
స్టేడియాలు చూసొద్దాం బహుళ ప్రయోజన క్రీడలకు అనుకూలంగా 1999లో ఈ స్టేడియాన్ని నిర్మించారు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్, ఫుట్‌బాల్, రగ్బీ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఆఫ్ ఫీల్డ్ సౌకర్యాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. న్యూజిలాండ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, వెల్లింగ్టన్ స్కూల్ ఆఫ్ క్రికెట్ ఇందులోనే నడుస్తుంటాయి. నగరంలో ఎక్కడి నుంచైనా నడుచుకుంటూ ఈ స్టేడియానికి వెళ్లిపోవచ్చు. ఈ మైదానం ఎత్తయిన ప్రదేశంలో ఉండటం వల్ల సహజమైన గాలులు ఎక్కువగా వీస్తాయి. సామర్థ్యం 34 వేలు. ఇందులో 70 శాతం సీట్లకు పైకప్పు ఉండదు. ఇక్కడ గ్రీన్‌బెల్ట్ రహదారులు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు, ఓడ రేవులు, వాటర్ ఫాల్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ మైదానంలో మార్చి 21న క్వార్టర్‌ఫైనల్-4 జరుగుతుంది. -
సిడ్నీ (ఎస్సీజీ)
ఆస్ట్రేలియాలో గత 150 ఏళ్లుగా క్రీడలకు ప్రముఖ కేంద్రంగా విరాజిల్లుతోంది సిడ్నీ. నగరానికి ఈస్ట్‌లో మూరే పార్క్‌లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)ని నెలకొల్పారు. ఈ స్టేడియంలో ఎక్కడి నుంచి మ్యాచ్‌ను చూసినా చాలా దగ్గర్నించి తిలకించిన అనుభూతి కలగడం దీని ప్రత్యేకత. మొదట్లో గ్యారిసన్ గ్రౌండ్‌గా పిలిచిన ఈ మైదానంలో 1848 నుంచి క్రికెట్ ఆడుతున్నారు. బ్యాటింగ్‌కు ఈ వికెట్ స్వర్గధామం. ఎన్నో అద్భుతమైన మ్యాచ్‌లకు ఇది వేదికగా నిలిచింది. బ్రాడ్‌మన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తగత స్కోరు (452 నాటౌట్) చేసింది ఇక్కడే. 1970లో వికెట్లో గణనీయ మార్పులు తీసుకురావడంతో స్పిన్నర్లకు అనుకూలంగా మారింది. న్యూసౌత్‌వేల్స్ బ్లూస్‌కు ఇది సొంత మైదానం. ప్రస్తుతం దీని కెపాసిటీ 44,002. ఆసీస్ టూరిజానికి సిడ్నీ పెట్టింది పేరు. అంతర్జాతీయ వాణిజ్యం, విద్య, విశ్రాంతికి ఇది ప్రసిద్ధి. 140 భాషల ప్రజలు ఇక్కడికి వచ్చిపోతుంటారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అతిపెద్ద హార్బర్ ఇక్కడే ఉంది. మార్చి 8న ఆస్ట్రేలియా, శ్రీలంక మ్యాచ్‌తో పాటు 18న క్వార్టర్‌ఫైనల్-1, 26న సెమీస్-2కు ఈ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. -
పెర్త్ (వాకా)
ప్రపంచంలోని ఫాస్టెస్ట్ పిచ్ లలో ఒకటిగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ (వాకా) మైదానానికి గుర్తింపు ఉంది. 1893లో అధికారికంగా ఈ స్టేడియాన్ని ప్రారంభిస్తే 1894లో టర్ఫ్ వికెట్‌పై తొలి మ్యాచ్ ఆడారు. పెర్త్ సామాజిక, సంస్కృతికి నిలయంగా ఈ స్టేడియం ఉంటుంది. అథ్లెటిక్స్, ఏఎఫ్ఎల్, బేస్‌బాల్, సాకర్, రగ్బీ లీగ్స్లకు ఆతిథ్యమిస్తున్నా... ఎక్కువగా క్రికెట్‌తోనే ప్రాచుర్యంలోకి వచ్చింది. మైదానంలో ఉన్న వాకా మ్యూజియంలో క్రికెట్ చరిత్రకు సంబంధించిన ఎన్నో గుర్తులు కనిపిస్తుంటాయి. రవాణవ్యవస్థలో ఇబ్బందులు ఉండటం వల్ల ఆసీస్ ప్రధాన క్రికెట్‌తో ఇది ఎక్కువగా అనుసంధానం కాలేకపోయింది. ఇప్పటికీ ఇక్కడికి వెళ్లాంటే షెడ్యూల్ ప్రకారం ఉన్న విమానాల్లోనే వెళ్లాల్సి వస్తుంది. 1970-71లో వేసిన పిచ్‌పైనే రెండు మూడేళ్లు క్రికెట్ ఆడారు. కానీ తర్వాతి రోజుల్లో దాన్ని తొలగించి కొత్త వికెట్‌ను రూపొందించారు. స్వాన్ నదిపై నుంచి వచ్చే వేడి గాలుల వల్ల మధ్యాహ్నం విపరీతమైన ఉక్కపోత ఉంటుంది. 2002లో మైదానం పునర్నిర్మాణంలో భాగం గా సీటింగ్ కెపాసిటీని తగ్గించారు. ఆట ఆడే ప్రాంతాన్ని కూడా కుదించారు. మైదానంలో చిన్న చిన్న స్టాండ్లు, ప్లేయర్స్ పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు. కానీ మైదానానికి రెండు వైపుల ఎక్కువ భాగం పచ్చికతో ఏర్పాటు చేసిన నేలపైనే కూర్చొని మ్యాచ్‌ను తిలకిస్తారు. దీంతో స్టేడియం సామర్థ్యం 22 వేలకు పడిపోయింది. పెద్ద మ్యాచ్‌లకు తాత్కాలిక సీట్లను ఏర్పాటు చేసి సామర్థ్యాన్ని 24,500కు పెంచుతారు. పెర్త్‌లో పచ్చని పొదలు, స్థానికంగా లభించే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వైన్, సముద్రపు గాలులు ఆహ్లాదాన్ని కల్గిస్తాయి. భారత్ ఫిబ్రవరి 28న యూఏఈతో, మార్చి 6న వెస్టిండీస్‌తో ఇక్కడ ఆడుతుంది. -
హోబర్ట్ (బెల్లెరివ్ ఓవల్)
టాస్మానియా రాజధాని అయిన హోబర్ట్ను 1804లో కనుగొన్నారు. ఎక్కువ మంది పర్యాటకులు... చరిత్రాత్మక శివారు ప్రాంతాలను తిలకించేందుకు ఇక్కడకు వస్తుంటారు. దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన రెస్టారెంట్లు, కెఫేలు, ఉత్సాహపూరితమైన సంగీతం, నైట్‌లైఫ్ కల్చర్‌కు ఇది చాలా ప్రసిద్ధి. బెల్లెరివ్ ఓవల్ మైదానం టాస్మానియా అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రధాన కేంద్రం. 1988 నుంచి ఇక్కడ క్రికెట్ ఊపందుకుంది. గతంలో ఫుట్‌బాల్ స్టేడియంగా కూడా వాడుకున్నారు. హోబర్ట్ సిటీ సెంటర్ నుంచి 10 నిమిషాల ప్రయాణం. 1931లో నిర్మించిన ఈ స్టేడియాన్ని బెల్లెరివ్లో 2003 వరకు అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. సదరన్ స్టాండ్స్‌లో కొత్తగా 6 వేల సీట్లను అందుబాటులోకి తేవడంతో పాటు ఇండోర్ నెట్స్, ఇద్దరు సభ్యులకు బిల్డింగ్‌లను నిర్మించారు. ప్రస్తుతం దీని సామర్థ్యం 20 వేలు. ఈస్ట్రన్ బౌండరీ వైపు ఎత్తై గుట్ట ఉండటం ప్రత్యేక ఆకర్షణ. మైదానం మధ్యలో 10 వికెట్లను రూపొందించారు. దీనికి కొద్ది దూరంలో డార్వెంట్ నది ఉండటంతో మధ్యాహ్నం సమయంలో గాలులు వీస్తాయి. -
కాన్బెర్రా (మనుకా ఓవల్)
క్రికెట్ స్టేడియం ఉన్న మనుకా ఓవల్ ప్రాంతం భిన్న సంస్కృతులకు నిలయం. క్రికెట్, ఏఎఫ్ఎల్కు ప్రీమియర్ సైట్‌గా ఈ మైదానం ఉపయోగపడుతుంది. స్టేడియం పరిసర ప్రాంతాల్లో వృక్షాలు, చిన్న పార్క్‌లు ఉండటంతో వాతావరణం ఎప్పుడూ ఆహ్లాదభరితంగా ఉంటుంది. దీంతో మ్యాచ్‌ను చూసేందుకు వచ్చే సందర్శకులకు కనువిందు కలుగుతుంది. 1962లో బ్రాడ్‌మన్ పేరుతో పెవిలియన్ ఏర్పాటు చేయడంతో పాటు 87, 92లలో కొత్తగా స్టాండ్స్‌ను నిర్మిం చారు. మనుకా ఓవల్ బ్రాడర్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఈ స్టేడియాన్ని క్రమంగా అభివృద్ధి చేస్తున్నారు. 2013లో ఫ్లడ్‌లైట్స్‌ను బిగించారు. సిటీ సెంటర్, పార్లమెంట్, విమానాశ్రయం నుంచి మైదానానికి 10 నిమిషాల ప్రయాణం. దీని కెపాసిటీ 13,550. ఆస్ట్రేలియాకు రాజధాని అయిన కాన్బెర్రా పాత సంస్కృతికి ఆధునికతకు ప్రతీక. ఈ నగరాన్ని కృత్రిమంగా నిర్మించిన ‘బర్లీ గ్రిఫిన్’ అనే సరస్సు చుట్టూ నిర్మించారు. -
గత ప్రపంచ కప్ వీరుల్లో నలుగురికే చోటు
ముంబై: గత వన్డే ప్రపంచ కప్-2011లో ఆడిన భారత జట్టులో నలుగురికి మాత్రమే తాజా ప్రపంచ కప్ జట్టులో స్థానం లభించింది. స్వదేశంలో జరిగిన గత ఈవెంట్లో భారత్ ప్రపంచ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ధోనీ సారథ్యంలోని టీమిండియా ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. కాగా నాలుగేళ్ల క్రితం టీమిండియాకు ఆడిన ఆటగాళ్లలో కెప్టెన్ ధోనీతో పాటు విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, అశ్విన్ మాత్రమే మళ్లీ ఎంపికయ్యారు. త్వరలో జరిగే మెగా ఈవెంట్ కు మంగళవారం భారత జట్టును ప్రకటించారు. గత ప్రపంచ కప్‌లో ఆడిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ రిటైరవగా.. సెహ్వాగ్, గంభీర్, యువరాజ్, చావ్లా, హర్భజన్, జహీర్ ఖాన్, నెహ్రా, మునాఫ్ పటేల్, యూసుఫ్ పఠాన్, ప్రవీణ్ ఫామ్‌లేమితో జట్టులో చోటు కోల్పోయారు. ఇక స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌పై నిషేధం విధించారు. గత ఈవెంట్లో యువరాజ్ అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యువీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఇక ఓపెనర్లు సెహ్వాగ్, గంభీర్, బౌలర్లు జహీర్‌తో పాటు అప్పట్లో ఇతర ఆటగాళ్లు రాణించారు. 2015 ప్రపంచ కప్ జట్టు: ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, రహానె, జడేజా, ఇషాంత్ శర్మ, షమీ, స్టువార్ట్ బిన్నీ, ఉమేష్ యాదవ్, అంబటి రాయుడు, భువనేశ్వర్ కుమార్, అక్షర పటేల్, అశ్విన్ -
ప్రపంచ కప్ నకు ఇదీ భారత జట్టు
న్యూఢిల్లీ: త్వరలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. జట్టు వివరాలను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. భారత జట్టులో తెలుగుతేజం అంబటి రాయుడకు చోటు లభించింది. కాగా గత ప్రపంచ కప్ లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు మొండిచేయి ఎదురైంది. ఆల్ రౌండర్ జడేజాను జట్టులోకి తీసుకోవడంతో యువీకి చోటు దక్కలేదు. ఇక మురళీ విజయ్, రాబిన్ ఊతప్పలకు కూడా స్థానం లభించలేదు. భారత జట్టు: ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, రహానె, జడేజా, అంబటి రాయుడు, ఇషాంత్ శర్మ, షమీ, స్టువార్ట్ బిన్నీ, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అక్షర పటేల్, అశ్విన్ -
ప్రపంచ కప్ 2015 అంబాసిడర్‌గా సచిన్
దుబాయ్: వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌నకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంబాసిడర్‌గా నియమితులయ్యాడు. సోమవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ మేరకు ప్రకటించింది. వచ్చే ఫిబ్రవరి నుంచి జరిగే ఈ మెగా ఈవెంట్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రపంచ కప్ అంబాసిడర్‌గా సచిన్‌ను వరుసగా రెండోసారి నియమించడం విశేషం. స్వదేశంలో జరిగిన గత ప్రపంచ కప్‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటి భారత్ జట్టులో సచిన్ ఉన్నాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత సచిన్‌దే.