
క్రికెటర్లను మీటింగ్ లతో విసిగించొద్దు!
కరాచీ:వన్డే వరల్డ్ కప్ లో పేలవమైన ఫామ్ తో వరుస రెండు ఓటములను మూట గట్టుకుని సర్వత్రా విమర్శలను అందుకుంటున్న పాకిస్థాన్ క్రికెటర్లకు ఆ జట్ట మాజీ కెప్టెన్, బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ బాసటగా నిలిచాడు. గెలుపు -ఓటమి అనేవి సహజంగా వస్తూ ఉంటాయని.. వాటి నుంచి ఆటగాళ్లు తేరుకోవడానికి కాస్త విశ్రాంతినివ్వమని జట్టు మేనేజ్ మెంట్ కు సూచించాడు. టీమ్ మేనేజ్ మెంట్ అనవసరంగా క్రికెటర్లతో మీటింగ్ లు పెట్టి విసిగించవద్దని అక్రమ్ తెలిపాడు.సుదీర్ఘమైన సమావేశాలు, చర్చలు, కఠిన శిక్షణలు అనేవి ఎప్పుడూ మంచిఫలితాలను ఇవ్వవన్నాడు. ఆ క్రికెటర్ల తదుపరి మ్యాచ్ కు ఫ్రెష్ మైండ్ సెట్ తో ఉండేందకు పాక్ క్రికెట్ పెద్దలు సహకరించాలని విజ్ఞప్తి చేశాడు.
టీమిండియా, వెస్టిండీస్ లపై ఘోర పరాజయాన్ని చూసిన పాకిస్థాక్ క్రికెట్ టీమ్ పై ఇంటా బయటా విమర్శలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పాకిస్థాన్ క్రికెట్ పేలవ ఫామ్ పై లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీమిండియా, వెస్టిండీస్ జట్లపై ఓటమికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ షర్ యార్ అహ్మద్ ఖాన్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నజామ్ సేథీలే కారణమని.. వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని న్యాయవాది రిజ్వాన్ గుల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటు ఆ మ్యాచ్ ల్లో పాకిస్థాన్ ఓటమిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆ పిటిషన్ లో న్యాయవాది కోరడంతో క్రికెటర్లలో ఆందోళన మొదలైంది.