విధ్వంసక ఇన్నింగ్స్ తో క్రిస్ గేల్ డబుల్ సెంచరీ.. శామ్యూల్స్ సెంచరీతో మోతెక్కించడంతో ప్రపంచకప్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన లీగ్ మ్యాచ్ లో వెస్టిండీస్ విసిరిన భారీ లక్ష్యాన్ని జింబాబ్వే ఛేదించలేకపోయింది. 44.3 ఓవర్లలో 289 పరుగులు చేసి ఆలౌటైంది. జింబాబ్వే ఆటగాళ్లలో విలియమ్స్ కాసేపు పోరాటం చేసినప్పటికీ ఫలితాన్ని మార్చలేకపోయాడు. 61 బంతుల్లో 9 ఫోర్లతో 76 పరుగుచేసిన విలియమ్స్ ఇన్నింగ్స్ 28వ ఓవర్లో అవుటయ్యాడు. ఇర్విన్ అర్థసెంచరీ(52) సాధించాడు. ఓపెనర్ రజా 26, టెయిలర్ 37, కెప్టెన్ చిగుంబుర 21 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, టెయిలర్ చెరో మూడు వికెట్లు తీయగా డబుల్ సెంచరీ వీరుడు క్రిస్ గేల్ బౌలింగ్ లోనూ మాయాజాలం చేశాడు. 6 ఓవర్లు వేసిన గేల్.. 35 పరుగులిచ్చి 2 వికెట్లు నేలకూల్చాడు. శామ్యూల్స్ కు ఒక వికెట్ దక్కింది. ఆద్యంతం అద్భుత ప్రదర్శననిచ్చిన క్రిస్ గేల్ నే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు రెండో ఓవర్లోనే ఓపెనర్ స్మిత్ వికెట్ ను కోల్పోయింది. జింబాబ్వే బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో క్రిస్ గేల్, శామ్యూల్స్.. వికెట్ ను కాపాడుకుంటూ నిలకడగా ఆడారు. ఇన్నింగ్స్ చివరి పది ఓవర్లలో చెలరేగిన గేల్, శామ్యూల్స్ జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించారు. వరుస సిక్స్ లు, ఫోర్ లతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. ఏదేని వికెట్ కు ప్రపంచ రికార్డు భాగస్వామ్యం (372 పరుగులు) నెలకొల్పారు. వన్ డేల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించడంతోపాటు, వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా గేల్ చరిత్ర సృష్టించాడు. ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు (16) సాధించి రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స సరసన నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి గేల్ అవుటవ్వడంతో 50 ఓవర్లలో విండీస్ 372 పరుగుల భారీస్కోరు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో వర్షం కారణంగా కాసేపు ఆట నిలిచిపోయింది. దీంతో డక్ వర్త లూయిస్ పద్ధతి ప్రకారం జింబాబ్వే 363 (48 ఓవర్లు)గా నిర్ణయించారు. అయితే, 289 పరుగులకే ఆలౌట్ కావడంతో 73 పరుగుల తేడాతో వెస్టిండీస్ గెలిచినట్లయింది.
జింబాబ్వేపై విండీస్ విజయం
Published Tue, Feb 24 2015 5:02 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM
Advertisement
Advertisement