
గత ప్రపంచ కప్ వీరుల్లో నలుగురికే చోటు
ముంబై: గత వన్డే ప్రపంచ కప్-2011లో ఆడిన భారత జట్టులో నలుగురికి మాత్రమే తాజా ప్రపంచ కప్ జట్టులో స్థానం లభించింది. స్వదేశంలో జరిగిన గత ఈవెంట్లో భారత్ ప్రపంచ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ధోనీ సారథ్యంలోని టీమిండియా ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. కాగా నాలుగేళ్ల క్రితం టీమిండియాకు ఆడిన ఆటగాళ్లలో కెప్టెన్ ధోనీతో పాటు విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, అశ్విన్ మాత్రమే మళ్లీ ఎంపికయ్యారు. త్వరలో జరిగే మెగా ఈవెంట్ కు మంగళవారం భారత జట్టును ప్రకటించారు.
గత ప్రపంచ కప్లో ఆడిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ రిటైరవగా.. సెహ్వాగ్, గంభీర్, యువరాజ్, చావ్లా, హర్భజన్, జహీర్ ఖాన్, నెహ్రా, మునాఫ్ పటేల్, యూసుఫ్ పఠాన్, ప్రవీణ్ ఫామ్లేమితో జట్టులో చోటు కోల్పోయారు. ఇక స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్పై నిషేధం విధించారు. గత ఈవెంట్లో యువరాజ్ అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యువీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా ఎంపికయ్యాడు. ఇక ఓపెనర్లు సెహ్వాగ్, గంభీర్, బౌలర్లు జహీర్తో పాటు అప్పట్లో ఇతర ఆటగాళ్లు రాణించారు.
2015 ప్రపంచ కప్ జట్టు:
ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, రహానె, జడేజా, ఇషాంత్ శర్మ, షమీ, స్టువార్ట్ బిన్నీ, ఉమేష్ యాదవ్, అంబటి రాయుడు, భువనేశ్వర్ కుమార్, అక్షర పటేల్, అశ్విన్