న్యూఢిల్లీ: మూడు నెలలుగా ఇంటి మొహమే చూడని భారత మహిళల, పురుషుల హాకీ జట్లకు ఎట్టకేలకు ఊరట లభించింది. హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఇరు జట్ల క్రీడాకారులకు నెల రోజుల పాటు ‘హోమ్ సిక్’ సెలవులు మంజూరు చేసింది. దీంతో శుక్రవారం వారంతా స్వస్థలాలకు పయనమయ్యారు. భారత పురుషుల, మహిళల హాకీ జట్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాయి. దీంతో వీరికి బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. అయితే కరోనా మహమ్మారి వల్ల మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ మొదలైంది. వైరస్ ఉధృతి కొనసాగడంతో టోక్యో ఈవెంట్ కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అయినప్పటికీ లాక్‌డౌన్ వల్ల ఆటగాళ్లంతా బెంగళూరులోనే చిక్కుకుపోయారు. గతనెల చివరి వారం నుంచి సడలింపులు ఇవ్వడంతో ఇక ఇంటికి వెళ్లే వెసులుబాటు దక్కింది. దీంతో హెచ్‌ఐ ఇరు జట్ల చీఫ్ కోచ్‌లను సంప్రదించి నెలపాటు శిక్షణకు విరామం ఇస్తేనే మళ్లీ నూతనోత్సాహంతో బరిలోకి దిగుతారని భావించి సెలవులు మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment