భారత్ మీసం మెలేసింది
హాకీ జూనియర్ ప్రపంచకప్ విజేత టీమిండియా
ఫైనల్లో బెల్జియంపై 2–1తో విజయం
టోర్నీని అజేయంగా ముగించిన యువ జట్టు
టైటిల్‌తో 15 ఏళ్ల నిరీక్షణకు తెర
సొంతగడ్డపై భారత యువ ఆటగాళ్లు అద్భుతం చేశారు. ఆద్యంతం దూకుడుగా ఆడిన ఈ రైజింగ్ స్టార్స్ అ‘ద్వితీయం’ నమోదు చేశారు. రెండోసారి జూనియర్ ప్రపంచకప్ టైటిల్‌ను సాధించారు. జాతీయ క్రీడకు మళ్లీ జీవం పోశారు. 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించడంతోపాటు భారత హాకీ భవిష్యత్‌కు భరోసా ఇచ్చారు. ఈ టోర్నీలో భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలవడం విశేషం.
లక్నో: స్వర్ణం తప్ప మరో పతకం గురించి ఆలోచనే లేదని భారత యువ హాకీ ఆటగాళ్లు నిరూపించారు. స్వదేశంలో జరిగిన హాకీ జూనియర్ అండర్–21 ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఇక్కడి మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 2–1 గోల్స్ తేడాతో బెల్జియం జట్టుపై గెలిచింది. భారత్ తరఫున గుర్జంత్ సింగ్ (8వ ని.లో), సిమ్రన్‌జీత్ సింగ్ (22వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... బెల్జియం జట్టుకు ఫాబ్రిస్ (70వ ని.లో) ఆఖరి సెకన్లలో ఏకైక గోల్‌ను అందించాడు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో జర్మనీ 3–0తో ఆస్ట్రేలియాపై నెగ్గింది.
37 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మెగా ఈవెంట్‌లో భారత జట్టు రెండోసారి టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. భారత్ చివరిసారి, ఏకైకసారి 2001లో జూనియర్ ప్రపంచకప్‌ను సాధించింది. ఆ తర్వాత ఈ టోర్నీలో ఒక్కసారి కూడా క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయింది. అయితే ఈసారి మాత్రం సొంతగడ్డపై యువ ఆటగాళ్లు చెలరేగిపోయారు. తమ ఆటతీరుతో, దూకుడుతత్వంతో ఒక్కో అడ్డంకిని అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఫైనల్ చేరే క్రమంలో రెండు జట్లు అజేయంగా నిలువడంతో అంతిమ సమరం హోరాహోరీగా సాగుతుందని భావించారు. క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో ‘షూటౌట్’లో నెగ్గిన బెల్జియం జట్టుకు ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. మంచి సమన్వయంతో ముందుకు దూసుకెళుతూ అవకాశం దొరికినప్పుడల్లా బెల్జియం గోల్‌పోస్ట్‌పై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో వరుసగా రెండు పెనాల్టీ కార్నర్‌లు సంపాదించారు. అయితే ఒత్తిడిలో వాటిని వృథా చేసుకున్నా... వెంటనే తేరుకొని ఎనిమిదో నిమిషంలో బోణీ చేసింది. ఎడమవైపు నుంచి ‘డి’ సర్కిల్‌లోకి వచ్చిన గుర్జంత్ క్లిష్టమైన కోణం నుంచి రివర్స్ ఫ్లిక్ షాట్‌తో బెల్జియం గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించి భారత్‌కు తొలి గోల్‌ను అందించాడు.
ఖాతా తెరిచిన ఉత్సాహంలో భారత ఆటగాళ్లు మరింత దూకుడుగా ఆడారు. ఫలితంగా తొలిసారి ఫైనల్‌కు చేరిన బెల్జియం ప్రత్యర్థి దాడులను నిలువరించడానికే ప్రాధాన్యత ఇచ్చింది. 22వ నిమిషంలో సిమ్రన్‌జీత్ సింగ్ గోల్‌తో భారత్ 2–0తో ముందంజ వేసింది. తొలి అర్ధభాగాన్ని భారత్ ఇదే స్కోరుతో ముగించింది. రెండో అర్ధభాగంలో బెల్జియం తమ దాడుల్లో పదును పెంచినా భారత రక్షణపంక్తి అప్రమత్తత కారణంగా వారికి నిరాశే మిగిలింది. 2–0తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ... సెమీస్‌లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ జర్మనీని ఓడించిన బెల్జియంను చివరి నిమిషం వరకు భారత్ ఏమాత్రం తేలిగ్గా తీసుకోలేదు. చివరి సెకన్లలో పెనాల్టీ కార్నర్ సంపాదించిన బెల్జియం దానిని గోల్‌గా మలిచినా అప్పటికే ఆలస్యమైపోయింది. తాజా విజయంతో జర్మనీ తర్వాత ఈ టైటిల్‌ను రెండుసార్లు గెలిచిన రెండో జట్టుగా భారత్ గుర్తింపు పొందింది.