ఆ యువతికి మొదటిసారి అనుమానం వచ్చింది. తనేదైనా ట్రాప్‌లో చిక్కుకుపోతున్నానా అని భయానికి లోనైంది. అప్పటికే ఐదు గంటలుగా ఆమె తన ప్రమేయం లేకుండానే ఢిల్లీ ఆటోల్లో తిరుగుతోంది. బాగా అలసటగా ఉంది. చీకటిపడి చాలా సేపే అయింది.
ఇండియాను చూసేందుకు వచ్చిన ఒక విదేశీ యువతి, ఇరవై నాలుగ్గంటల్లోనే ఇండియాను వదిలి వెళ్లిపోయిందంటే కారణం ఏమై ఉంటుంది? ‘స్టార్ట్ ఇమీడియట్‌లీ’ అనే కాల్ ఆమెకు ఆమె కుటుంబ సభ్యుల నుంచి వచ్చి ఉండాలి. లేదంటే, ‘ఇండియా నుంచి వెంటనే పారిపో’ అనే సంకేతం ఆమె మనసుకు అంది ఉండాలి. గత ఏడాది డిసెంబర్ 6 సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఒక బెల్జియం యువతి.. ఇరవై నాలుగ్గంటల్లోపే ఇండియా నుంచి తప్పించుకుని వెళ్లింది. బెల్జియం వెళ్లిన కొన్నాళ్లకు రాయబార కార్యాలయానికి వెళ్లింది. ఇండియాలో ఆ రోజు ఏం జరిగిందీ వెల్లడించింది.
ఆ విషయాన్ని బెల్జియం.. భారత విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తెచ్చింది. వెంటనే భారత ప్రభుత్వం ‘హంట్’ మొదలు పెట్టింది. ఇండియాలో ఆ రోజు ఫ్లయిట్ దిగగానే తనకు తారసపడిన వారు అడుగడుగునా తననెంత అయోమయంలో పడేసిందీ, తననెలా మోసం చేయాలని ప్రయత్నించిందీ, తనెంత మానసిక ఒత్తిడికి లోనైందీ వివరిస్తూ బెల్జియం యువతి చేసిన ఫిర్యాదుపై భారత ప్రభుత్వం ఇప్పుడు ఢిల్లీ పోలీసులను పరుగులు తీయిస్తోంది. ఆమెను ఇరవై నాలుగ్గంటల్లోపు పారిపోయేలా చేసి, దేశ ప్రతిష్టను దెబ్బతీసిన వారందరినీ ఇరవై నాలుగ్గంటల్లో పట్టుకోవాలని ఆదేశాలు వెళ్లాయి మరి. నిందితులను పట్టుకుంటే దేశం పరువు దక్కేదేం ఉండదు. కానీ నిందితులను పట్టుకోలేకపోతే మాత్రం అది ఇంకో పరువుపోయే విషయం అవుతుంది!
జరిగిందేమిటి?
ఆ సాయంత్రం ఢిల్లీలో దిగిన వెంటనే బెల్జియం యువతి ఒక సిమ్ కార్డు కొనుగోలు చేసింది. అక్కడే ఆటో ఎక్కి, న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌కు పోనివ్వమంది. మింటో రోడ్డుకు వెళ్లాలి తను. అయితే ఆటోవాలా ఆమె మింటో రోడ్డు వైపు కాకుండా ఇంకో రూట్‌లో తీసుకెళ్లి ఇద్దరు మగ మనుషుల ముందు ఆటో ఆపాడు. వాళ్లు ఆ యువతికి తమ పోలీస్ ఐడెంటిటీ కార్డులు చూపించారు. ‘‘ఇటువైపు నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ముందుకు వెళ్లాలంటే, మీరు టూరిస్టు పోలీసుల అనుమతి తీసుకోవాలి’’ అని ఆమెకు ఒక అడ్రెస్ ఇచ్చారు, టూరిస్టు పోలీసులు ఆ అడ్రస్‌లో ఉంటారని! ఆటోవాలా అమెను ఆ అడ్రెస్‌కు తీసుకెళ్లాడు.
అక్కడ మళ్లీ ఆరుగురు మగవాళ్లు ఉన్నారు. వాళ్లంతా పోలీస్ యూనిఫామ్‌లో ఉన్నారు. ‘‘మీరు వెళ్లాలని అనుకుంటున్న వైపు వెళ్లడం అసంభవం. వెంటనే మీరు ఈ ప్రాంతాన్ని వదిలివెళితే మంచిది’’ అని చెప్పారు. ఆమెకేవో హింసాత్మక నిరసన ప్రదర్శనల లైవ్ వీడియోలను కూడా చూపించారు. తర్వాత ఆమె మెడలోని ఆభరణాలను చూస్తూ, ‘‘గోల్డేనా?’’ అని అడిగారు. ఆమె బుక్‌చేసిన హోటల్ ఫోన్ నంబర్ అడిగి తీసుకుని, హోటల్‌కి ఫోన్ చేసి,‘‘మీ రూమ్ బుకింగ్ క్యాన్సిల్ అయిందట! చెప్పాం కదా, పరిస్థితి బాగోలేదని’’ అన్నారు. అక్కడే ఉన్న ఒక ఆటోను చూపించి, ‘‘అందులో ఎక్కి సెంట్రల్ ఢిల్లీలోని ఫలానా ట్రావెల్స్‌కు వెళ్లండి’’ అని సలహా ఇచ్చారు.
మొదటి ఆటోవాలా పక్కకు తప్పుకున్నాక, రెండో ఆటోవాలా ఆమెను ఎక్కించుకుని ఎన్.డి.ఎం.సి.మార్కెట్ (న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ మార్కెట్) ఏరియాలో ఉన్న ట్రావెల్ ఏజెన్సీ దగ్గర ఆపాడు. అక్కడ ఇద్దరు మనుషులు ఆమెను రిసీవ్ చేసుకున్నారు. ఒక వ్యక్తికి లైన్ కలిపి ఫోన్‌ని ఆమె చేతికి ఇచ్చారు. హోటల్ బుకింగ్ గురించి ఆ వ్యక్తికి తెలుస్తుందని చెప్పారు. యువతికి మొదటిసారి అనుమానం వచ్చింది. తనేదైనా ట్రాప్‌లో చిక్కుకుపోతున్నానా అని భయానికి లోనైంది. అప్పటికే ఐదు గంటలుగా ఆమె తన ప్రమేయం లేకుండానే ఢిల్లీ ఆటోల్లో తిరుగుతోంది. అలసటగా ఉంది. చీకటి కూడా పడింది. ‘‘నిజమే, మీ బుకింగ్ క్యాన్సిల్ అయింది. వీటిల్లో కొన్ని రూములు ఉన్నాయట’’ అని ఆమెకు కొన్ని హోటళ్లు, రెంట్‌ల వివరాలు ఇచ్చారు.
అవన్నీ ఖరీదైనవి. చివరికి విసుగెత్తి, రోజుకు నలభై డాలర్ల రెంట్ (సుమారు మూడు వేల రూపాయలు) ఉన్న హోటల్ గదిని బుక్ చేయమంది. చేశారు. అక్కడి నుంచి ఆటో ఆమెను ఆ హోటల్ ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లింది. ఆమె గది థర్డ్ ఫ్లోర్‌లో ఉంది. కిటికీల్లేవు. ఇంటర్నెట్ లేదు! వెంటనే గది తలుపులు వేసుకుని లోపల లాక్ చేసుకుంది. ఈలోపు కొత్త సిమ్ కార్డ్ యాక్టివేట్ అయింది. రిషికేష్‌లో తెలిసినవాళ్లుంటే వాళ్లకు ఫోన్ చేసి, జరిగిందంతా చెప్పింది. రిషికేష్ నుంచి అక్కడి వాళ్లు, ఈ యువతి మొదట బుక్ చేసిన హోటల్‌కి ఫోన్ చేసి అడిగితే, ‘‘క్యాన్సిల్ ఏమీ కాలేదే. ఆమె పేరు మీదే ఇప్పటికీ రూమ్ ఉంది’’ అని చెప్పారు. అది తెలిసి యువతి నిశ్చేష్టురాలైంది. కొద్ది నిమిషాల్లోనే ఆ హోటల్ సిబ్బంది (మొదట ఆమె బుక్ చేసిన హోటల్) వచ్చి యువతిని సురక్షితంగా తమతో తీసుకెళ్లారు.
తెల్లారి లేచీ లేవగానే రూమ్ ఖాళీ చేసి, అప్పటికి అందుబాటులో ఉన్న ఫ్లయిట్ ఎక్కి ఆ యువతి తన స్వదేశానికి వెళ్లిపోయింది. ఈ వివరాలన్నీ బాధితురాలు తమ రాయబార కార్యాలయానికి ఇచ్చిన ఫిర్యాదులో పొందుపరిచింది. మళ్లీ ఇండియా వెళ్లేది లేదని అంటోంది. బెల్జియం ఆ ఫిర్యాదును ఇండియాకు ఫార్వర్డ్ చేసింది. ఆ యువతిని వేధించిన ఆగంతకుల మీద, ఆటో రిక్షాల డ్రైవర్‌ల మీద, ట్రావెల్ ఏజెన్సీ మీద, హోటల్ మీద, దొంగ పోలీసుల మీద భారత విదేశీ వ్యవహారాల శాఖ.. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. మహిళలకు సంబంధించిన ఏ కేసైనా ఆమె దృష్టికి వెళితే త్వరగా పరిష్కారం అవుతుందని పేరు. మీరు ఈ వార్తా కథనాన్ని చదివే సమయానికి దాదాపు నిందితులంతా చట్టం చేతికి చిక్కినా ఆశ్చర్యం లేదు.
ఒక్కరే వెళ్తున్నారా?
ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యంగా.. దేశం దాటాల్సి వస్తే తీసుకోవల్సిన కనీస జాగ్రత్తలు..
►ఒంటరిగా హోటల్‌లో గది బుక్ చేసుకునే కంటే ట్రావెలర్స్ హాస్టల్స్‌లో బస చేయడం మంచిది. ఇంటర్నెట్‌లో ఇలాంటి వివరాలు ఉంటాయి. చూసుకొని బుక్ చేసుకోవాలి.
►మీరు వెళ్లే ప్రాంతానికి సంబంధించిన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వివరాలనూ ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవాలి. ఒకవేళ హోటల్లో రూమ్ బుక్ చేసుకునుంటే పికపింగ్, డ్రాపింగ్ సౌకర్యం ఉందేమో తెలుసుకుని మీ ఫ్లయిట్ వివరాలు వాళ్లకు ఇచ్చి.. పికప్ చేసుకోవడానికి వెహికల్ పంపమని కోరాలి. ఆ సౌకర్యం లేకపోతే వెహికల్ అరేంజ్ చేయమని రిక్వెస్ట్ చేయాలి. ట్రావెల్స్ హాస్టల్స్‌లో బస ఏర్పాటు చేసుకున్నట్లయితే హాస్టల్‌లో ఉన్న వాళ్ల నంబర్ తీసుకొని పికప్ చేసుకోవడానికి వాళ్లను రమ్మని కోరవచ్చు.
►ఏ ప్రాంతానికి వెళ్తున్నారో ఆ ప్రాంతానికి తగ్గట్టే డ్రెస్ వేసుకోవడం మంచిది.
►కాలక్షేపానికి తిరుగుతున్నట్టు కనపడకండి.
►మీరు ఆ ప్రాంతానికి కొత్తవారని పసిగట్టి స్థానికులు మీ గురించి ఆరా తీస్తే ఏమీ చెప్పకూడదు. అంటే మీ ఒంటరి ప్రయాణం, బస చేస్తున్న ప్రదేశాల వివరాలు వగైరా బయటపెట్టవద్దు.
►స్థానిక హెల్ప్‌లైన్స్ నంబర్లను దగ్గర పెట్టుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment