భళా... భారత్‌  | Hockey World Cup 2018: India maul Canada 5-1 to book quarterfinal berth | Sakshi
Sakshi News home page

భళా... భారత్‌ 

Published Sun, Dec 9 2018 12:19 AM | Last Updated on Sun, Dec 9 2018 12:19 AM

Hockey World Cup 2018: India maul Canada 5-1 to book quarterfinal berth  - Sakshi

భువనేశ్వర్‌: ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. పూల్‌ ‘సి’లో శనివారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 5–1తో కెనడాపై ఘనవిజయం సాధించింది. చివరి క్షణాల్లో చిత్తయ్యే జట్టు రొటీన్‌కు భిన్నంగా చివరి క్వార్టర్‌లోనే 4 గోల్స్‌ చేయడం విశేషం. స్ట్రయికర్‌ లలిత్‌ ఉపాధ్యాయ్‌ చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో భారత్‌ 7 పాయింట్లతో పూల్‌ టాపర్‌గా నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. టీమిండియా తరఫున లలిత్‌ (47వ ని., 56వ ని.) రెండు గోల్స్‌ చేయగా, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (12వ ని.), చింగ్లేసనా సింగ్‌ (46వ ని.), అమిత్‌ రోహిదాస్‌ (51వ ని.) తలా ఒక గోల్‌తో ఘనవిజయానికి ఊతమిచ్చారు. కెనడా జట్టులో నమోదైన ఏకైక గోల్‌ను ఫ్లొరిస్‌ వాన్‌ సన్‌ 39వ నిమిషంలో కొట్టాడు.

ఆట ఆరంభం నుంచే లలిత్‌ ఉపాధ్యాయ్‌ పట్టు సాధించే ప్రయత్నం చేశాడు. తన దాడులకు పదునుపెట్టాడు. అయితే కెనడా శిబిరం అప్రమత్తంగా ఉండటంతో గోల్‌ అవకాశం చేజారింది. మొదటి పెనాల్టీ కార్నర్‌ విఫలమవగా, ఆట 12వ నిమిషంలో లభించిన రెండో పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్‌ గోల్‌గా మలచి భారత్‌కు శుభారంభాన్నిచ్చాడు. అయితే మరో గోల్‌ కోసం ఇంకో రెండు క్వార్టర్లు పోరాడినా ఫలితం లేకపోయింది. ఇక చివరి క్వార్టర్‌ను భారత ఆటగాళ్లు శాసించారు. కెనడా ఫార్వర్డ్‌లైన్‌ను ఓ కంట కనిపెట్టుకుంటూనే ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా కదంతొక్కారు. ఈ క్రమంలో చింగ్లేసనా, లలిత్‌ వరుసగా 46, 47 నిమిషాల్లో గోల్స్‌ చేయగా, అమిత్‌ 51వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. ఆట ముగిసేదశలో లలిత్‌ ఉపాధ్యాయ్‌ రెండో గోల్‌తో కెనడాను దెబ్బకొట్టాడు. 

సోమవారం లీగ్‌ దశ మ్యాచ్‌లు పూర్తయ్యాకే భారత క్వార్టర్‌ ఫైనల్‌ ప్రత్యర్థి ఖరారవుతుంది. అం తా అనుకున్నట్లు జరిగితే ఈ నెల 12న జరిగే క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌కు పటిష్టమైన నెదర్లాండ్స్‌ లేదంటే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ ఎదురయ్యే అవకాశముంది. మరో మ్యాచ్‌లో బెల్జియం 5–1తో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. పూల్‌ ‘సి’ నుంచి బెల్జియం, కెనడా జట్లు క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌లకు అర్హత సాధించాయి. ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో మలేసియాతో జర్మనీ, పాకిస్తాన్‌తో నెదర్లాండ్స్‌ తలపడతాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement