పోరాడి ఓడిన భారత్
ఫైనల్లో బెల్జియం
1-0తో టీమిండియాపై గెలుపు
రాయ్‌పూర్: ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించాలని భావించిన భారత జట్టుకు నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 0-1 గోల్ తేడాతో బెల్జియం చేతిలో ఓడిపోయింది. ఆట ఐదో నిమిషంలో సెడ్రిక్ చార్లియర్ చేసిన గోల్‌తో బెల్జియం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు భారత ఆటగాళ్లు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో బెల్జియం; కాంస్య పతక పోరులో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడతాయి. బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు తొలి రెండు భాగాల్లో అనుకున్నంత దూకుడుగా ఆడలేకపోయారు. మరోవైపు బెల్జియం అవకాశం వచ్చిన ప్రతీసారి భారత గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. అయితే మ్యాచ్ మొత్తంలో రెండు జట్లకు ఒక్క పెనాల్టీ కార్నర్ కూడా రాకపోవడం గమనార్హం. సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు ఆటగాళ్లు బంతిని తమ ఆధీనంలో 59 శాతం ఉంచుకున్నా... బెల్జియం గోల్‌పోస్ట్ ‘డి’ ఏరియాలోకి 24 సార్లు చొచ్చుకెళ్లినా గోల్‌ను మాత్రం చేయలేకపోయారు.