మన హాకీ మన గౌరవం
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఒక ప్రకటన క్రీడాభిమానులను విశేషంగా ఆలోచింపజేస్తోంది. ‘ప్రపంచాన్ని గెలిచినా దేశంలో మనసులు గెలవలేకపోయాం’ అంటూ భారత హాకీ క్రీడాకారులు చేసిన వ్యాఖ్య జాతీయ క్రీడపై మన దేశంలో ఉన్న నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. ఈ నెల 20 నుంచి బెల్జియంలో జరిగే ప్రపంచ హాకీ లీగ్ సెమీఫైనల్స్‌లో భారత్ ఆడబోతోంది. దీని ప్రచారం కోసం స్టార్ స్పోర్ట్స్ సంస్థ ఈ ప్రకటనను రూపొందించింది. క్రికెట్ ప్రపంచకప్ సమయంలో ‘మౌకా మౌకా’ అంటూ చేసిన ప్రకటన తరహాలో ఇది కూడా ఆకట్టుకుంది. ప్రేక్షకులను హాకీ వైపు ఆకర్షించడానికి స్టార్ స్పోర్ట్స్ సంస్థ ఈ ప్రకటన తయారు చేసి ఉండొచ్చు. కానీ హాకీ క్రీడాకారులు మాట్లాడిన మాటలు ఎన్నో ఏళ్లగా వారిలో ఉన్న ఆవేదనకు రూపాన్నిచ్చాయి.
క్రికెట్‌లో ఏ చిన్న మ్యాచ్ జరిగినా చూస్తున్నాం. భారత జట్టు బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్ ఆడుతుంటే వర్షం పడుతున్నా టీవీకి అతుక్కుపోతున్నాం. కానీ జాతీయ క్రీడ హాకీలో భారత జట్టు ఘన విజయాలు సాధిస్తున్నా ఆదరించడం లేదు. ఈ పరిస్థితిలో కొంతైనా మార్పు రావాలి. హాకీ లీగ్ సెమీఫైనల్స్‌లో భారత్... ఆస్ట్రేలియా, పోలండ్, ఫ్రాన్స్, పాకిస్తాన్‌ల రూపంలో బలమైన జట్లతో ఆడబోతోంది. క్రికెటర్లలా హాకీ క్రీడాకారులపై కాసుల వర్షం కురవదు. అభిమానుల ఆదరణ, ప్రోత్సాహమే వారికి కోట్ల రూపాయలకు సమానమైన మ్యాచ్ ఫీజు. అందుకే హాకీకి మద్దతుగా నిలుద్దాం. అన్నట్లు పురుషుల టోర్నీతో పాటు సమాంతరంగా ప్రపంచ హాకీ లీగ్ సెమీఫైనల్స్ మహిళలకూ జరుగుతోంది. ఇందులో భారత మహిళల జట్టు కూడా ఉంది.
ఆ ప్రకటనలో ఏముందంటే...
►‘బెల్జియం వెళుతున్నారు. భారత హాకీ భవిష్యత్ ఏమిటి?’ అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తారు. దీనికి వరుసగా భారత హాకీ క్రీడాకారులు చెప్పిన సమాధానాలు...
► భవిష్యత్‌ను నిర్మిస్తున్నాం. ఇటీవల ఏం సాధించామో మీకు తెలుసుగా.
► గత 15 ఏళ్లలో సాధ్యం కానిది, ఒక్క ఏడాదిలో సాధించాం.ప్రపంచంలోని టాప్-5 జట్లను ఓడించాం.
► ఆస్ట్రేలియాను వాళ్ల సొంత గడ్డపై ఓడించి సిరీస్ గెలిచాం.
► ఈ గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. కానీ భారత్‌లో తెలియదు. (కోచ్ పాల్ వాన్ వ్యాఖ్య)
►మరో జర్నలిస్ట్ ప్రశ్న: బెల్జియంలో పాకిస్తాన్ కూడా ఉంటుందిగా? ఆ తర్వాత వరుసగా సమాధానాలు:
► ఉండనీయండి. వాళ్లను ఓడించే ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచాం. రియో ఒలింపిక్స్‌కు అందరికంటే ముందుగా అర్హత సాధించాం.
► కానీ ఫలితం ఏముంది. భారతీయుల మనసులో చోటు సాధించలేకపోయాం.
► ఇప్పుడు బెల్జియం వెళుతున్నాం. దేశం కోసం ఆడటానికి. మద్దతుగా నిలవండి.