
ఫైనల్ కు చేరతాం: సౌరవ్ గంగూలీ
కోల్ కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ లో తమ జట్టు ఫైనల్ కు చేరుతుందని ఆశిస్తున్నట్లు అట్లెటికో డి కోల్‌కతా సహయాజమాని సౌరవ్ గంగూలీ తెలిపాడు. గత శనివారం జరిగిన తొలి అంచె సెమీస్ ఫైనల్-2లో కోల్‌కతా 0-3 తేడాతో చెన్నైయిన్ ఎఫ్‌సీపై పరాజయం చూసింది. దీనిపై గంగూలీ స్పందిస్తూ.. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన తాము తిరిగి గాడిలో పడతామని అభిప్రాయపడ్డాడు. రెండో అంచె సెమీఫైనల్-2లో కోల్ కతా 3-0 తేడాతో చెన్నైయన్ ను ఓడిస్తామన్నాడు.
'మాకు ఫైనల్ కు చేరతామనే నమ్మకం ఉంది. తదుపరి మ్యాచ్ లో చెన్నైయన్ ను ఓడిస్తాం. చాలాసార్లు చెన్నైయన్ ఎఫ్ సీపై మాదే పైచేయి. ఈసారి అదే పునరావృతం అవుతుందని ఆశిస్తున్నా. మన శాయశక్తులా కృషి చేస్తే విజయం అదే వస్తుంది. ఒకవేళ ఓడిపోయినా పోరాడి ఓడితేనే ఆటకు అర్థం. ఏం జరుగుతుందో వేచి చూద్దాం 'అని గంగూలీ పేర్కొన్నాడు. ప్రపంచ ఫుట్ బాల్ లో మేటి జట్లైన బ్రెజిల్, జర్మనీ, నెదర్లాండ్స్ లకే ప్రతీసారి వరల్డ్ కప్ రావాలని కోరుకోవడం కూడా అత్యాశే అవుతుందని మరోపక్క గంగూలీ ఛలోక్తులు విసిరాడు. అట్లెటికో డి కోల్‌కతా -చెన్నైయిన్ ఎఫ్‌సీల మధ్య బుధవారం రెండో అంచె సెమీఫైనల్-2 మ్యాచ్ జరుగనుంది.