జాతీయ క్రీడలు ఎలా సాధ్యం?
సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: ‘2018లో జరిగే జాతీయ క్రీడలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధమైంది. ఈ విషయాన్ని కేంద్రానికి ఇప్పటికే తెలియజేశాం’...ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటన ఇది. బుధవారం జాతీయ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ మాట చెప్పారు.
అసలు సీఎం జాతీయ క్రీడల గురించి సమాచారం, అవగాహన లేకుండా ఈ మాట చెప్పారా... లేదంటే అన్నీ తెలిసి అలవాటుగా వ్యాఖ్య చేశారా అనేది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ క్రీడలను ఇప్పటికే ఉత్తరాఖండ్‌కు కేటాయించారు. ఏపీ ప్రభుత్వం ఆరంభ శూరత్వం ప్రదర్శించింది గానీ నిజంగా క్రీడల హక్కులు దక్కించుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు.
కోరిక ఈనాటిది కాదు
ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిననాటినుంచి చంద్రబాబు జాతీయ క్రీడల నిర్వహణ గురించి చెబుతూనే వచ్చారు. దీనికి సంబంధించి గత ఏడాది జులై 31న క్రీడా మంత్రి అచ్చెన్నాయుడు ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు. అయితే జులై 31న సమావేశానంతరం దాదాపు మూడు నెలల పాటు ప్రభుత్వం స్తబ్దుగా ఉండిపోయింది. చివరకు నవంబర్ 30న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు లేఖ రాశారు.
2018లో లేదా మరో సంవత్సరంలో విజయవాడలో జాతీయ క్రీడలు నిర్వహించే అవకాశం ఇవ్వాలని ఐఓఏ అధ్యక్షుడు ఎన్. రామచంద్రన్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే నిజంగా హక్కులు కేటాయించాలంటే ఏమేం చేయాలో తెలియజేస్తూ ఏపీ ఒలింపిక్ సంఘం, ప్రభుత్వానికి వివరాలు ఇచ్చింది. రూ. 50 లక్షలు డిపాజిట్ చేసి బిడ్ వేయాలని సూచిం చింది. అధికారుల అలసత్వానికి తోడు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పాటు ఒలింపిక్ సంఘం చేసిన ఏ సూచననూ పరిగణనలోకి తీసుకోలేదు.
ఏం జరిగిందంటే...
38వ జాతీయ క్రీడల కేటాయింపు గురించి డిసెంబర్ 19న చెన్నైలో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సమావేశం జరిగింది. ఆ రోజు నాటికి బిడ్ వేసినా అవకాశం దక్కేదేమో. కానీ ఏపీ తరఫున మాత్రం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగలేదు. ఈ సమావేశంలో ఏపీనుంచి ఎలాంటి ప్రతిపాదన రాకపోవడం తో క్రీడలను ఉత్తరాఖండ్‌కు కేటాయించారు. ఆ రాష్ట్రానికి చెందిన ఏడుగురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆకట్టుకున్నారు. అలా ఆ అవకాశం ఇప్పటికే చేజారిపోయింది.
అవకాశం ఉందా!
ప్రస్తుతం కేరళలో జరుగబోతున్నవి 35వ జాతీయ క్రీడలు. ఇవి షెడ్యూల్ ప్రకారం 2012లోనే జరగాలి. కానీ ఇవి 2015లో జరుగుతున్నాయి. 36వ క్రీడలను (2014-గోవా), 37వ క్రీడలను (2016-ఛత్తీస్‌గఢ్)కు ఇప్పటికే కేటాయించారు. 2018 ఉత్తరాఖండ్‌కు వెళ్లిపోయింది. ఇవన్నీ ఏ ఏడాదిలో జరుగుతాయో తెలీదు. అన్నీ సవ్యంగా ఉంటే ఉత్తరాఖండ్‌లో 2018 క్రీడలు 2020లో జరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు మేమూ సిద్ధమంటూ, కేంద్రానికి చెప్పేశామంటూ ప్రకటనలు ఇస్తున్నారు.
తెలంగాణ జట్ల శుభారంభం
విజయవాడ స్పోర్ట్స్ : చుక్కపల్లి పిచ్చయ్య స్మారక 60వ జాతీయ సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లు శుభారంభం చేశా యి. బుధవారం ప్రారంభమైన ఈ టోర్నీలో పురుషుల విభాగంలో తెలంగాణ జట్టు 29-4, 29-1 తేడాతో మణిపూర్‌పై, మహిళల విభాగంలో తెలంగాణ జట్టు 29-6, 29-18 తేడాతో పంజాబ్ జట్టుపై గెలుపొందాయి.
ఈ టోర్నీలో 29 రాష్ట్రాల జట్లతో పాటు నాలుగు ఇన్‌స్టిట్యూషన్ జట్లు పాల్గొంటున్నాయి. 11 వరకు టోర్నీ జరుగుతుం ది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోటీలను ప్రారంభించారు. బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు రాజశేఖర్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.