కోహ్లీని అధిగమించిన ధోని
హైదరాబాద్: ఐపీఎల్-10 లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీని రైజింగ్ పుణే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ విషయంలో అధిగమించాడు. ఈ సీజన్ లో రైజింగ్ ఫుణే యాజమాన్యం కెప్టెన్ గా ధోనిని తొలిగించి స్టీవ్ స్మిత్ ను నియమించడం, ధోని పై విమర్శలు చేయడం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ధోని అభిమానులు పుణే యాజమాన్యం పై బాహాటంగానే విరుచుకు పడ్డారు. అయినా ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో తన విరోచిత బ్యాటింగ్ తో మరో మారు ఫినిషర్ గా గుర్తింపు పొందిన ధోని తాజాగా ట్వీటర్ లో అత్యధికంగా చర్చించుకుంటున్న ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
ఐపీఎల్-10లో ప్లేయర్స్ ఫోటోలతో ట్వీటర్ ఎమోజీ కాన్సెప్ట్ ను ప్రవేశ పెట్టారు. దీనిలో ఐపీఎల్ అభిమానులు అభిమాన ఎమోజీ ఫోటోతో హ్యాష్ టాగ్ చేస్తారు. గత నాలుగు వారాలుగా ధోని ట్వీటర్ ఎమోజీ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సోషల్ మీడియాలో అత్యంత ఆదరణ కలిగిన కోహ్లీని వెనక్కి నెట్టి ధోని అగ్రస్థానానికి చేరాడు. ఇక ఈ వారం కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ రెండో స్థానానికి చేరుకున్నాడు.
వరుస వైఫల్యాలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ అర్హత కోల్పోవడంతో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానానికి పరిమితమయ్యాడు. నాలుగో స్ధానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఫుణే రైజింగ్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఐదో స్ధానంలో ఉన్నారు. ఈ క్యాష్ రిచ్ లీగ్ లో నాలుగో వారంలో అత్యంత ఆదరణ పొందిన ఫ్రాంచైజీగా ముంబై ఇండియన్స్ గుర్తింపు పొందింది. ఇక గుజరాత్ లయన్స్, ముంబైల మధ్య జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్ అత్యంతగా చర్చించుకున్న మ్యాచ్ గా నిలిచింది.