ఒక్క బంతి కూడా వేయకుండానే 5 పరుగులు!
టీమిండియా భారీస్థాయిలో ఏకంగా 557 పరుగులు చేసి డిక్లేర్ చేసిన తర్వాత మార్టిన్ గుప్తిల్ మొట్టమొదటి బంతిని ఎదుర్కోడానికి వచ్చాడు. అయితే ఇండోర్ స్టేడియంలో స్కోరుబోర్డు చూసిన ప్రేక్షకులతో పాటు టీవీలలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే, మొదటి బంతి కూడా ఇంకా విసరకముందే న్యూజిలాండ్ స్కోరు 5/0 అని చూపిస్తున్నారు. పోనీ ఎక్స్‌ట్రాలు ఏమైనా వేశారా అంటే, 5 పరుగులు వచ్చే ఎక్స్‌ట్రాలు ఏమీ లేవు. ఎలా జరిగిందని చూస్తే.. మన 'సర్ జడ్డూ' రవీంద్ర జడేజా ఎన్నిసార్లు చెప్పినా పిచ్ మధ్యలోంచి పరుగులు తీయడంతో అతడికి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు జట్టుకు కూడా జరిమానాగా ఆతిథ్య జట్టుకు ముందుగానే 5 పరుగులు ఇచ్చేశారు.
ఇంతకుముందు కూడా బౌలింగ్ చేసేటప్పుడు అంపైర్‌ను గట్టిగా అప్పీలు చేయాలంటే పిచ్ మధ్యలోకి పరుగెత్తుకుని రావడం రవీంద్ర జడేజాకు అలవాటు. ఇంతకుముందు కోల్‌కతా టెస్టులో అంపైర్ రాడ్ టకర్ దీనిపై ఒకటి రెండుసార్లు జడేజాను హెచ్చరించారు. అప్పుడే అతడికి అధికారికంగా కూడా వార్నింగ్ ఇచ్చారు. అయితే న్యూజిలాండ్ కోచ్ మైక్ హెసన్ మాత్రం కేవలం 5 పరుగుల పెనాల్టీ విధిస్తే సరిపోతుందా అని అడిగారు. వికెట్లు త్వరగా పాడైపోయే దేశాల్లో అంపైర్లు ఆటగాళ్ల విషయంలో గట్టిగా వ్యవహరించాలని, అందుకు తగిన నిబంధనలు కూడా ఉన్నాయని అన్నారు.