భళా... భారత గురి  | Hriday Hazarika reigns in air rifle | Sakshi
Sakshi News home page

భళా... భారత గురి 

Published Sat, Sep 8 2018 12:51 AM | Last Updated on Sat, Sep 8 2018 12:51 AM

Hriday Hazarika reigns in air rifle - Sakshi

చాంగ్‌వాన్‌ (దక్షిణ కొరియా): ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత జూనియర్‌ షూటర్ల హవా కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్‌ ఆరో రోజు మన షూటర్లు 2 స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్యం సాధించారు. పురుషుల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో హృదయ్‌ హజారికా స్వర్ణం సాధించగా... మహిళల టీమ్‌ విభాగంలో భారత జట్టు వరల్డ్‌ రికార్డుతో పసిడి కైవసం చేసుకుంది. మహిళల వ్యక్తిగత విభాగంలో ఒక రజతం, కాంస్యం దక్కాయి. 17 ఏళ్ల హృదయ్‌ ఫైనల్లో మొహమ్మద్‌ అమీర్‌ (ఇరాన్‌)తో కలిసి 250.1 పాయింట్లు సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో విజేతను తేల్చేందుకు షూట్‌ఆఫ్‌ నిర్వహించగా... అందులో హజారికా 10.3 పాయింట్లతో స్వర్ణం నెగ్గాడు. అమీర్‌ 10.2 పాయింట్లతో రజతంతో సరిపెట్టుకున్నాడు. గ్రిగోరీ షామకోవ్‌ (228.6 పాయింట్లు–రష్యా)కు కాంస్యం దక్కింది. మహిళల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో భారత జట్టు సరికొత్త ప్రపంచ రికార్డుతో పసిడి కైవసం చేసుకుంది.

ఎలవెనిల్‌ వలరివన్‌ (631), శ్రేయ అగర్వాల్‌ (628.5), మాణిని కౌశిక్‌ (621.2)లతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో 1880.7 పాయింట్లతో ప్రపంచ రికార్డును నెలకొల్పడంతో పాటు పసిడి సొంతం చేసుకుంది. మహిళల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో ఎలవెనిల్‌ వలరివన్‌ రజతం సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆమె 249.8 పాయింట్లు సాధించి త్రుటిలో స్వర్ణం చేజార్చుకుంది. షై మెంగాయో ( 250.5 పాయింట్లు–చైనా) స్వర్ణం నెగ్గగా... శ్రేయ అగర్వాల్‌ (228.4 పాయింట్లు, భారత్‌) కాంస్యం చేజిక్కించుకుంది. ఇప్పటివరకు భారత్‌ ఈ టోర్నీలో మొత్తం 18 పతకాలు (6 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు) సాధించింది.  మరోవైపు సీనియర్‌ పురుషుల 50 మీ. రైఫిల్‌ త్రీ పొజిషన్‌ విభాగంలో భారత షూటర్లు నిరాశ పరిచారు. స్వప్నిల్, అఖిల్, సంజీవ్‌ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు.  

      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement