బంగ్లాకు భారీ ఆధిక్యం
షకీబుల్ హసన్ సెంచరీ
కొలంబో: బంగ్లాదేశ్ తమ వందో టెస్టులో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరుస్తోంది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 129 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. షకీబుల్ హసన్ (159 బంతుల్లో 116; 10 ఫోర్లు) సెంచరీతో చెలరేగడం విశేషం. శుక్రవారం 214/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ షకీబుల్, ముష్ఫికర్ రహీమ్ (81 బంతుల్లో 52; 6 ఫోర్లు) లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని ఆరో వికెట్‌కు 92 పరుగులు జోడించారు.
అర్ధసెంచరీ అనంతరం రహీమ్ నిష్క్రమించగా తర్వాత వచ్చిన ముసాదిక్ హŸస్సేన్ (155 బంతుల్లో 75; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా షకీబ్‌కు అండగా నిలిచాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 131 పరుగులు జతచేయడంతో బంగ్లాదేశ్ 400 పరుగుల స్కోరుని అధిగమించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన శ్రీలంక మూడో రోజు ఆట నిలిచే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేసింది. ఓపెనర్లు కరుణరత్నే (25 బ్యాటింగ్), తరంగ (25 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆ జట్టు మరో 75 పరుగులు వెనుకబడి ఉంది.