ఈ రంజీ ట్రోఫీ సీజన్‌లో తొలి గెలుపు కోసం ఎంతో ఎదురు చూసిన హైదరాబాద్, ఆంధ్ర జట్లకు ఆ ఆనందం దక్కింది. శనివారం ముగిసిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్, రైల్వేస్‌పై విజయం సాధించగా...ఆంధ్ర, మధ్యప్రదేశ్‌ను చిత్తు చేసింది. రెండు మ్యాచ్‌ల రద్దు, ఒక పరాజయం తర్వాత హైదరాబాద్ గెలవగా...మూడు ‘డ్రా’ల తర్వాత ఆంధ్రకు విజయం దక్కింది.
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’లో ఆంధ్ర జట్టు 15 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. శనివారం ఇక్కడ ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్ర 8 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్‌పై ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ నిర్దేశించిన 65 పరుగుల విజయలక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి అందుకుంది. విహారి (28 నాటౌట్), ప్రశాంత్ (23) రాణించారు. అయితే ఛేదనలో 2 వికెట్లు కోల్పోవడం వల్ల బోనస్ పాయింట్ సాధించే అవకాశాన్ని ఆంధ్ర చేజార్చుకుంది.
అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 67/5తో ఆట కొనసాగించిన మధ్య ప్రదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 119 పరుగులకే ఆలౌటైంది. బుందేలా (38) టాప్‌స్కోరర్‌గా నిలవగా...అయ్యప్ప (5/34) మరో సారి చెలరేగాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన అయ్యప్పకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. అగర్తలలో ఈ నెల 9నుంచి జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో ఆంధ్ర, త్రిపురతో తలపడుతుంది.
హైదరాబాద్‌కు బోనస్ పాయింట్
న్యూఢిల్లీ: గత మ్యాచ్‌లో కర్ణాటక చేతిలో ఓడిన హైదరాబాద్ వెంటనే కోలుకుంది. శనివారం ఇక్కడ ముగిసిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో రైల్వేస్‌పై ఘన విజయం సాధించింది. అదనంగా బోనస్ పాయింట్‌ను కూడా అందుకుంది. ఫాలోఆన్‌లో ఓవర్‌నైట్ స్కోరు 13/0తో ఆట కొనసాగించిన రైల్వేస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 250 పరుగులకు ఆలౌటైంది. మనీశ్ రావు (128 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే పోరాడాడు.
హైదరాబాద్ బౌలర్లలో మెహదీ హసన్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం 23 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 5.2 ఓవర్లలో చేరుకుంది. కెరీర్ తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లోనే సత్తా చాటిన టి.రవితేజ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ నెల 17నుంచి గువహటిలో జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో అస్సాంతో హైదరాబాద్ తలపడుతుంది.
ఇతర నాలుగో రౌండ్ మ్యాచ్‌లలో కర్ణాటక ఇన్నింగ్స్, 136 పరుగుల తేడాతో మహారాష్ట్రపై, ఢిల్లీ 4 వికెట్లతో ఉత్తరప్రదేశ్‌పై, సౌరాష్ట్ర 6 వికెట్లతో జార్ఖండ్‌పై, గుజరాత్ 238 పరుగులతో హర్యానాపై, కేరళ 158 పరుగులతో జమ్మూ కశ్మీర్‌పై, ముంబై 120 పరుగులతో ఒడిషాపై, విదర్భ 192 పరుగులతో సర్వీసెస్‌పై, పంజాబ్ ఇన్నింగ్స్, 118 పరుగులతో ఛత్తీస్‌గఢ్‌పై విజయం సాధించగా...బెంగాల్–హిమాచల్ ప్రదేశ్, బరోడా–త్రిపుర మధ్య జరిగిన మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment