సాక్షి, హైదరాబాద్: విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్–16 క్రికెట్ టోర్నీలో భాగంగా కేరళ జట్టుతో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు రాణించింది. స్థానిక జింఖానా మైదానంలో శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలిరోజు హైదరాబాద్ 87.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఇల్యాన్ సథాని (56; 10 ఫోర్లు), టి. రోహన్ (51; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో జట్టు ఓ మోస్తరు స్కోరును సాధించగలిగింది. వైఎస్ వరుణ్ (43; 8 ఫోర్లు), త్రిషాంక్ గుప్తా (39; 6 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో కిరణ్ సాగర్, అభి బిజు చెరో 3 వికెట్లు దక్కించుకోగా, శ్రీనాథ్ 2 వికెట్లు పడగొట్టారు.
ఆదుకున్న లోయర్ ఆర్డర్
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. జట్టు స్కోరు 30 పరుగుల వద్ద కె. కార్తీక్ రెడ్డి (6) ఎల్బీగా వెనుదిరిగాడు. స్వల్ప వ్యవధిలోనే మరో ఓపెనర్ సాత్విక్ రెడ్డి (22), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పి. శివ (13), కెప్టెన్ కె. సాయి పూర్ణానంద రావు (0) పెవిలియన్ చేరారు. ఈ దశలో వైఎస్ వరుణ్ కాసేపు ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అడపాదడపా అతను బౌండరీలు బాదడంతో స్కోరు ముందుకెళ్లింది.
షణ్ముఖ (9)తో కలిసి 40 పరుగుల్ని జోడించాక అభి బిజ్జు బౌలింగ్‌లో వరుణ్ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత షణ్ముఖ కూడా అవుటవ్వడంతో 96 పరుగులకే హైదరాబాద్ 6 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో వి. సహస్ర (18), ఇల్యాన్ జోడీ కుదురుగా ఆడింది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 67 పరుగులు జోడించిన అనంతరం నిఖిల్ బౌలింగ్‌లో సహస్ర అవుటయ్యాడు. తర్వాత రోహన్, త్రిషాంక్ గుప్తా జంట తొమ్మిదో వికెట్‌కు 88 పరుగుల్ని జతచేయడంతో జట్టు సాధారణ స్కోరును సాధించింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన కేరళ జట్టు ఆటముగిసే సమయానికి 5.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది.
నితీశ్ 190 బ్యాటింగ్
తమిళనాడు జట్టుతో ఎన్‌ఎఫ్‌సీ గ్రౌండ్స్‌లో జరుగుతోన్న మరో మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు భారీస్కోరు సాధించింది. ఓపెనర్ కె. నితీశ్ కుమార్ రెడ్డి (300 బంతుల్లో 190 బ్యాటింగ్; 25 ఫోర్లు, ఒక సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు 93 ఓవర్లలో 3 వికెట్లకు 320 పరుగులు చేసింది. జె. సూర్య చైతన్య (56) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, సుబ్రహ్మణ్యం (38) రాణించాడు. నితీశ్‌తో పాటు ధరణి కుమార్ (27 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment