హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ఎన్నికల వ్యవహారం ఒక కొలిక్కి రాక ముందే జట్ల ఎంపికపై ఇప్పుడు కొత్త దుమారం చెలరేగింది.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ఎన్నికల వ్యవహారం ఒక కొలిక్కి రాక ముందే జట్ల ఎంపికపై ఇప్పుడు కొత్త దుమారం చెలరేగింది. ఈ నెల 15నుంచి చెన్నైలో జరగబోయే బుచ్చిబాబు టోర్నీ కోసం హైదరాబాద్ జట్టును గురువారం హెచ్‌సీఏ అధ్యక్షుడు జి. వినోద్ ప్రకటించారు. ఇది హెచ్‌సీఏ నిబంధనలకు విరుద్ధమని సీనియర్ సభ్యుడొకరు ఆరోపించారు. గత నెలలోనే కమిటీ రద్దయిందని, త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఒక వివాదం సాగుతుండగా...వినోద్ మరింత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
‘నియమావళి ప్రకారం హెచ్‌సీఏలోని ఏ సబ్ కమిటీకైనా కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. సెలక్షన్ కమిటీకి కూడా అతనే కన్వీనర్. కార్యదర్శి లేనట్లయితే సంయుక్త కార్యదర్శి ఆ బాధ్యత నిర్వహించాలి. అంతే తప్ప జట్టును ఎంపిక చేసి ప్రకటించేందుకు అధ్యక్షుడికి ఎలాంటి అధికారం లేదు’ అని ఆయన చెప్పారు. హెచ్‌సీఏలో ఇద్దరు సంయుక్త కార్యదర్శులు ఉండగా, ఎవరికీ కూడా ఈ టీమ్ సెలక్షన్ గురించి కనీస సమాచారం కూడా ఇవ్వలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ జట్టు చెన్నైకి వెళ్లి టోర్నీ ఆడే వరకు సందేహమేనని హెచ్‌సీఏ వర్గాలు చెబుతున్నాయి.
ఇక్కడా అంతే!
మరో వైపు నేటి నుంచి జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం హైదరాబాద్ క్రికెట్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ (హెచ్‌సీఏఈ) తరఫున రెండు అండర్-19 టీమ్‌లను ఎంపిక చేశారు. ఇది కూడా కార్యదర్శితో సంబంధం లేకుండా అకాడమీ డెరైక్టర్ కన్వల్జిత్ సింగ్ సొంతంగా ఎంపిక చేసుకున్నారు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధమేనని తెలుస్తోంది.